CM Revanth Reddy Orders To Officials : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణశాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన సూచించారు. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కాగా ద్రోణి, ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది.
ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి : లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
పలు జిల్లాల్లో వర్షాలు : రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇవాళ పలుచోట్ల పిడుగులు పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్నగర్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడ మడలం ఓటాయి వద్ద పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందారు. గూడురు మండలం గుండెంగ వద్ద పిడుగుపడి మహిళ మృతి చెందింది. నల్గొండ మండలం అప్పాజీ పేట వద్ద బావి వద్ద తోటలో పనిచేస్తుండగా పిడుగుపడి మహిళ మృతి చెందారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం - మంత్రి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
IMD చల్లటి కబురు - రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు