ETV Bharat / state

ఫ్యూచర్​ సిటీకి కొత్త వెబ్​సైట్​? - ఏ సమాచారం కావాలన్నా అందులోనే

ఫ్యూచర్ సిటీకి అఫిషియల్ వెబ్​సైట్​ - తీసుకురావని నిర్ణయించిన సీఎం రేవంత్​ - ఐటీ విభాగానికి పని అప్పగింత

Official Website For Future City in Hyderabad
Official Website For Future City in Hyderabad (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 1, 2025 at 8:00 AM IST

2 Min Read
Choose ETV Bharat

Official Website For Future City in Hyderabad : తెలంగాణల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి కొత్త వెబ్​సైట్​ను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 15లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ పేరుతో వెబ్​సైట్​ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను ఐటీ శాఖలోని ఓ విభాగానికి అప్పగించారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ వెబ్​సైట్ల తరహాలో ఇది ఉండనుంది. సిటీలో దేని గురించైనా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ సైట్ ఉపయోగపడుతుంది.

ఫ్యూచర్‌ సిటికీ సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల ప్రతినిధుల వివరాలు అందులో ఉంటాయి. భావి నగరంలో ప్రాజెక్టుల సమగ్ర వివరాలను పొందుపరచనున్నారు. దీంతోపాటు ఫ్యూచర్‌ సిటీ పరిధిలో ఐటీ భవనాలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన అనుమతులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కమిషనర్ల నియామకం తర్వాత పనులు ముందుకు : భావినగర అభివృద్ధి సంస్థ కమిషనర్‌గా ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని నియమించింది. కార్యకలాపాల నిర్వహణకు 36మంది అధికారులను నియమించారు. వీరు విధుల్లో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో భూసేకరణ అంశాలను అప్పగించనున్నారు. వారి నియామకం తర్వాత పనులు శరవేగంగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. అనుకున్న సమయంలో సీటీ నిర్మాణం పూర్తవుతుందని అనుకుంటున్నారు. మరోవైపు మీర్‌ఖాన్‌పేటలో నిర్మిస్తున్న స్కిల్స్‌ వర్సిటీ సమీపంలోనే ఫ్యూచర్‌ సిటీ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

రేడియల్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు : మరోవైపు 15వేల ఎకరాల్లో నిర్మించాలి అనుకున్న ఫ్యూచర్ సిటీ మీదుగా గ్రీన్​ఫీల్డ్​ రేడియల్ రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు అన్నీ తొలగాయి. ఓఆర్​ఆర్​ సమీపం రావిర్యాల నుంచి ఆర్ఆర్​ఆర్ సౌత్​ భాగంలోని ఆమనగల్లు వరకు మొత్తం 41.5 కిలోమీటర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. దీనికి రతన్​టాటా రోడ్డుగా పేరు నిర్ణయించారు.

రేడియల్ రహదారిని రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలి దశలో రావిర్యాల (టాటా ఇంటర్​ఛేంజ్​) నుంచి మీర్​ఖాన్​పేట 19.20 కిలోమీటర్లు మేర రోడ్డు, రెండో దశలో మీర్​ఖాన్​పేట నుంచి ఆర్​ఆర్​ఆర్​ సౌత్​ భాగం పరిధిలోని ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్లు రోడ్లు నిర్మించనున్నారు. హెచ్​ఎండీఏ టెండర్లు ఖరారు చేయడంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. రెండు దశలకు కలిపి రహదారి నిర్మాణానికి రూ.4,030 కోట్లు, 1,003 ఎకరల భూసేకరణ రూ.591 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఎట్టకేలకు ముందడుగు : ఓఆర్‌ఆర్‌ నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా రోడ్డు నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ మండలాల పరిధిలోని మొత్తం 26 గ్రామాల మీదుగా రహదారి వెళ్లనుంది. ఓఆర్‌ఆర్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో మొత్తం 11 గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రావిర్యాల - ఆమనగల్లు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి నిర్మాణానికి ముందడుగు పడింది. స్కిల్స్‌ యూనివర్సిటీకి ఈ రోడ్డు అనుసంధానం అవ్వనుంది.

HMDA మాదిరిగా FCDA - లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు

ఆ 56 గ్రామాల్లోనే ఫ్యూచర్​ సిటీ పరిధి - వాటి వివరాలు ఇవే