CM Revanth on Warangal Health Tourism : వరంగల్లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నగరానికి త్వరలోనే ఎయిర్ పోర్ట్ రాబోతోందని, టెక్స్టైల్ పార్కు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం, అభివృద్ధి పనుల్ని పరిశీలించడం సహా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చివర్లో హంటర్ రోడ్లో మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ క్రమంలో మాట్లాడిన సీఎం, వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భాగ్యనగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్‌కు స్థానం ఉంటుందని కీర్తించారు.
వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు : ఇందుకు కారణం ఇందిరాగాంధీ దూరదృష్టి అని కొనియాడారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని గుర్తుచేశారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. శంషాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
వైద్యం అందించడం సామాజిక బాధ్యత : ఈమేరకు అన్ని రకాల వైద్య సేవలు అందించేలా తప్పకుండా మెడికల్ టూరిజం హబ్ ఉండాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సీఎం పేర్కొన్నారు. వైద్యం అందించడం సామాజిక బాధ్యతగా వైద్యులు గుర్తించాలన్న సీఎం, సేవా ధృక్పథంతో పని చేయాలని ఉద్భోదించారు. ఆసుపత్రికి ఎంతమంది వచ్చారని కాకుండా, ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యమని శ్లాఘించారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
CM Revanth Return Journey to Hyderabad : వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంపై, ఇక చారిత్రక నగరం రూపురేఖలు మారతాయని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. భారీ వర్షం పడడం, వాతావరణం అనుకూలించకపోవడం సహా నిర్దేశిత కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు.