CM Chandrababu Tribute to Ramoji rao on his First Death Anniversary : దివంగత రామోజీరావు తొలి వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు ఆయనకు ఘననివాళులర్పించారు. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదు, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గమని పాత్రికేయానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన మహర్షి రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన, నిష్పక్షపాత పాత్రికేయంతో సమాజంపై ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని తెలిపారు. పద్మవిభూషణ్ రామోజీరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆ అక్షర యోధుడికి ఘన నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఈ మేరకు శనివారం ఆయన పోస్ట్ చేశారు. రామోజీరావు మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో నిలిచే ఉంటుందని, ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని అన్నారు.
రామోజీరావు ఎగరేసిన అక్షరబావుటా నిత్య సత్యమై, నిత్య నూతనమై రోజూ ఉషోదయాన నినదిస్తూనే ఉందని కొనియాడారు. తలవంచని నైజం, వ్యాపారాల్లోనూ సమాజహితం చూసిన వైనం, ఆయనను సమున్నత స్థాయిలో నిలబెట్టిందన్నారు. అరాచక వ్యవస్థలపై ‘ఈనాడు’ సంస్థల ద్వారా ఆయన చేసిన పోరాటాలు, ప్రజాసమస్యలపై ఆయన చేసిన యుద్ధాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయన్నారు. రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని, సమాజాన్ని అత్యంత ప్రభావితం, అనునిత్యం చైతన్యవంతం చేసిన ఆయనను స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యత అని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావు తెలుగుజాతి సంపద అని కీర్తించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయనను మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు ఆయన మన మధ్య లేకపోయినా... విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు గారు… pic.twitter.com/VsUPzzkTpW
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2025
స్వయంకృషితో మహావృక్షమై ఎదిగిన శ్రమజీవి రామోజీరావు
పద్మవిభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతిరంగంలోనూ ఆయన చెరగని ముద్రవేశారని గుర్తు చేశారు. ఈనాడు ద్వారా పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారన్నారు. అవినీతిపై అక్షరయుద్ధం సాగించారని, నియంతృత్వ పోకడలపై అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. తన చివరి శ్వాస వరకు ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. ఆయన జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. తెలుగుజాతి కీర్తిశిఖరం రామోజీరావు సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నా అన్నారు.
పద్మవిభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతిరంగంలోనూ ఆయన చెరగని ముద్రవేశారు. ‘ఈనాడు’ ద్వారా పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారు.… pic.twitter.com/VOErNMuild
— Lokesh Nara (@naralokesh) June 8, 2025
విలువలు, విశ్వసనీయతతో జర్నలిజాన్ని నడిపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు. రామోజీరావు జీవితం ఎంతోమంది ఔత్సాహిక జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. రామోజీరావు స్థాపించిన 'ఈనాడు' అరాచక వ్యవస్థలపై ఎక్కుపెట్టిన బాణం లాంటిదని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ రామోజీరావు నింపిన చైతన్యం ఎన్నటికీ మరువలేనిదని తెలిపారు. తెలుగు రైతును దేశానికి మకుటం చేయాలని ఎంతో పరిశ్రమించారని గుర్తు చేశారు.
ఆధునిక జర్నలిజం పితామహుడు, పద్మ విభూషణ్ రామోజీరావు వర్ధంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి నివాళులు అర్పించారు. రామోజీరావు అక్షరమే ఆయుధంగా సమాజంలోని దుర్మార్గాలపై ప్రజల పక్షాన పోరాటం చేశారని తెలిపారు. ఆయన అనేక సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారని వెల్లడించారు. నిరంతరం ప్రజల మంచికోసం, సమాజహితం కోసం పరితపించి పని చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు. ఆలోచనల్లో నిత్య నూతనత్వం రామోజీరావు ప్రత్యేకత అని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని వెల్లడించారు.
రామోజీరావు ప్రథమ వర్ధంతి - రామోజీఫిల్మ్‌సిటీలో రక్తదాన శిబిరం