CM Chandrababu Teleconference with TDP Leaders: కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందని, జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు. సక్సెస్ చేసిన నేతలకు, కార్యకర్తలకు హాట్సాఫ్ అని చెప్పారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది: మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. మహానాడులో ప్రవేశపెట్టిన 'నా తెలుగు కుటుంబం'లోని 6 శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని అన్నారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామని సీఎం చంద్రబాబు అన్నారు.
పేదల సేవలో పాల్గొనాలి: ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేనని ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలని స్పష్టం చేశారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు: కడపలో 3 రోజుల మహానాడు విజయవంతమైనందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రులు సవిత, మండిపల్లి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ తెలిపారు. మహానాడు బహిరంగ సభకు లక్షల మంది ప్రజలు తరలి రావడంతో పాటు ప్రకృతి కూడా సహరించి ఖచ్చితమైన సమయానికే మహానాడు విజయవంతంగా పూర్తి అయిందని నేతలు తెలియజేశారు.
నా కష్టం నా కోసం కాదు - నన్ను నమ్మిన జనం కోసం: సీఎం చంద్రబాబు