CM Chandrababu Review on AP Roads : రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఏపీలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని తేల్చి చెప్పారు. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన రహదారి ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సంవత్సరం రూ.20,067 కోట్ల విలువైన 1040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఇకపై ఏ రోడ్డు నిర్మాణమూ ఆలస్యం కాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.11,325 కోట్లతో 770 కిలోమీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
Road Repairs in AP : ఏపీలో మొత్తం 8744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. వీటిలో 4406 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌ఏఐ రహదారులు, పీఐయూ-ఎంఓఆర్టీహెచ్ పరిధిలో 641 కిలోమీటర్ల రోడ్లు, ఎన్‌హెచ్ (ఆర్అండ్బీ) కింద 3697 కిలోమీటర్ల రోడ్లు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించారు. మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో ఎన్‌హెచ్‌ఏఐ కింద 1392 కిలోమీటర్ల రహదారులు, 2091 కిలోమీటర్ల ఎంవోఆర్‌టీహెచ్ రోడ్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు.
గుంతలు లేని రహదారులు కోసం గతేడాది నవంబర్‌లో రూ.860.81 కోట్లతో ప్రారంభించిన పనుల్లో 97 శాతం ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 19,475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్ని పూడ్చి మరమ్మతులు పూర్తైనట్లు చెప్పారు. మిగిలిన రోడ్ల మరమ్మతులను జూలై 31 నాటికి పూర్తి కానున్నాయని అధికారులు వెల్లడించారు.
గుంతల రోడ్లకు గుడ్ బై - రయ్‌రయ్‌మంటూ రైడ్!
ట్రాఫిక్ కష్టాలకు చెక్ - ఇక ఆ రహదారులన్నీ డబుల్ రోడ్లుగా అప్‌గ్రేడ్