CM Chandrababu Review on Roads in AP : రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం దారుణంగా ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. రెండు నెలల్లో రాష్ట్రంలోని గుంతలన్నీ పూడ్చాలని తేల్చి చెప్పారు.
రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap
రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల : రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల దెబ్బతిన్న 4,565 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ. 186 కోట్లు, వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం కోసం రూ. 290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో అంచనా వేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో రూ. 65 వేల కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులను కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి 3 నెలలకూ ఎంత పని పూర్తి చేయగలమో మదింపు చేసుకుని పనుల్ని పరుగులు పెట్టించాలన్నారు.
బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage
నిర్లక్ష్యం వహిస్తే : గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి వర్షాల వల్ల మరింత దారుణంగా తయారైందన్నారు. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌ల భూ సేకరణ కోసం పెండింగ్ లో ఉన్న రూ. 42 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేతుబంధన్, గతి శక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఆర్వోబీ లను పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని తేల్చి చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుంచి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం సూచించారు.