CM Chandrababu Review on Agriculture with Officials: 365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు అందించాలని ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచించారు. నరేగా నిధులతో వరిపొలాల గట్లు వెడల్పు, అంతరపంటలతో అధిక లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది పొడవునా సాగుభూములు పచ్చగా ఉండేలా చూడాలని ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని సూచించారు.
సన్నరకాలను పండిచేలా ప్రోత్సహం: వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని సీఎం చెప్పారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని దీనివల్ల భూసారం దెబ్బతింటోందని అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని సీఎం చెప్పారు. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వరి రైతుకు ఆదాయం మరింత పెరిగేలా అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. వరిపంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వాకల్చర్, హార్టీకల్చర్ సాగును కూడా ప్రయత్నించాలన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
పంటకాలాన్ని ముందుకు: అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయన్న చంద్రబాబు ఖరీఫ్ పంటలను తుపాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగు మాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. మరోవైపు వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్తగా 3 సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.
పల్సెస్, మిల్లెట్స్ సాగు పెరగాలి: ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సీఎం కోరారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని సూచించారు. పల్సెస్, మిల్లెట్స్ సాగు పెరగాలని కోరారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఇంటర్ విద్యార్థిని హత్య కేసు - జాతీయ మహిళా కమిషన్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్పీడ్ పెంచండి - ఇకపై ఏ రహదారి నిర్మాణం ఆలస్యం కాకూడదు: సీఎం చంద్రబాబు