CM Chandrababu at NITI AAYOG Meeting : వికసిత భారత్-2047కి ఆంధ్రప్రదేశ్ వాటాగా 2047 కల్లా 2.4 లక్షల కోట్ల డాలర్ల జీఎస్‌డీపీ సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇందుకోసం చతుర్ముఖ వ్యూహం అనుసరించనున్నట్లు నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశంలో వివరించారు. తూర్పుతీరాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాన్ని ఆగ్నేయాసియా ముఖద్వారంగా మారుస్తామని ప్రకటించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ఏపీలోని మానవ వనరులు, సహజ వనరుల అనుకూలతను ఉపయోగించుకొని వచ్చే 22 సంవత్సరాల్లో దాదాపు 15 శాతం వరకు వార్షిక వృద్ధి రేటు సాధిస్తామని చంద్రబాబు వివరించారు. దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశంలో స్వర్ణాంధ్ర- వికసిత్ భారత్ 2047పై బ్లూ ప్రింట్‌ను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 42,000ల డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలనూ గతిశీలంగా తయారుచేయాలన్నది తమ సంకల్పమని ఆయన తెలిపారు.
నైపుణ్యవంతమైన మానవ వనరులు ఏపీ ప్రధాన బలమని సీఎం వెల్లడించారు. దేశంలో అందరి కంటే ముందు సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా తెలుగు సమాజం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోందని ఆనందం వ్యక్తం చేశారు. దాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ఐటీ హబ్‌లు, పటిష్ఠమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించి స్టార్టప్స్ సంస్కృతిని ప్రోత్సహించబోతున్నట్లు వివరించారు.
NITI Aayog 10th Meeting : ఏపీలో గత ఐదు సంవత్సరాల పాలన రాష్ట్రానికి ఒక పీడకలగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఐదేళ్లనాటి అభివృద్ధి ఊపును ఆ తర్వాతి ఐదేళ్ల పాలన దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో ట్యాక్స్, జీఎస్‌డీపీ నిష్పత్తి కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు చెప్పారు. సేవా రంగం పూర్తిగా నష్టపోయిందని ఆదాయ మార్గాలు కుంచించుకుపోయాయని తెలిపారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సర్వీస్ సెక్టార్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు వివరించారు. రాష్ట్రం విడిపోయిన తొలి ఐదు సంవత్సరాల్లో సేవా రంగం వాటా 44 శాతం ఉండగా 2023-2024 నాటికి 42 శాతానికి పడిపోయిందని వాపోయారు. దీన్ని 2047-2048 నాటికి 51 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలియజేశారు.
రాష్ట్రాభివృద్ధికి చతుర్ముఖ వ్యూహాన్ని అవలంబించబోతున్నట్లు బ్లూప్రింట్‌లో చంద్రబాబు వివరించారు. పన్ను రాబడి పెంచుకుని ఆర్థిక స్థిరత్వం సాధిస్తామని చెప్పారు. పీ4తో పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి సామర్థ్యం పెంపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రమంతటికి నీటి భద్రత, రైతులకు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చి ఉత్పాదక సామర్థ్యం పెంపుతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చంద్రబాబు వెల్లడించారు
అన్ని రాష్ట్రాలూ అధ్యయనం చేయాలి : మానవ వనరులు, ఆర్థిక వనరుల సామర్థ్యాన్ని విస్తరించి, మూలధన వ్యయాన్ని పెంచి పీపీపీ విధానంలో మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల సృష్టి, కార్మికశక్తి పెంపుదల ద్వారా సంపద సృష్టిస్తామన్నారు. ఏపీ భవిష్యత్ ప్రస్థానాన్ని చాటిన బ్లూ ప్రింట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన సంస్కరణలను అన్ని రాష్ట్రాలూ అధ్యయనం చేయాలని ప్రధాని సూచించారు.
ఏపీని అమరావతి, తిరుపతి, కర్నూలు- ఓర్వకల్లు, గోదావరి జోన్లుగా విభజించి ప్రాంతీయంగా అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖను ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, విశాఖపట్నంలో మెడ్‌టెక్ జోన్లు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వీటికి తోడు విశాఖ- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు, చెన్నై- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లలో పారిశ్రామిక నగరాల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో బ్లూ, వైట్‌కాలర్ జాబ్‌లు సృష్టించి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
మోదీ పదేళ్ల పాలన దేశానికి బలమైన పునాదులు వేసిదంటూ ప్రధాని నాయకత్వ పటిమను చంద్రబాబు ప్రశంసించారు. జన్‌ధన్- ఆధార్- మొబైల్, స్వచ్ఛభారత్, జల్‌జీవన్ మిషన్, జీఎస్టీ అమలు, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్, స్టాండప్ ఇండియా, పీఎం గతిశక్తి, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, స్కిల్ ఇండియా కార్యక్రమాలు భారత్‌ను ప్రబలమైన ఆర్థిక శక్తిగా నిలిపేందుకు దోహదం చేశాయని వివరించారు. వాటి కారణంగానే 2014లో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే వేగంతో ముందుకెళ్తే 2027 నాటికి 3, 2047 నాటికి ఒకటి లేదా రెండో స్థానానికి భారత్ చేరడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలు విడుదల
2047 నాటికి ఏపీ నంబర్ వన్ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం