CM Chandrababu Participated in Ugadi Celebrations: రాష్ట్రంలోని ప్రజలంతా మెరుగైన జీవన ప్రమాణాలతో ఉండేందుకు మార్గదర్శి బంగారు కుటుంబం, పీ-4, జీరో పావర్టీ లక్ష్యాలుగా ముందడుగు వేస్తున్నామని ఇవి సాధించగలిగితే తన జన్మ చరితార్ధమైనట్టేనని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో సీఎం పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలు, సుఖాలు, అదృష్టాలు, దురదృష్టాలను తట్టుకుని నిలబడడం ముఖ్యమని ఉగాది పచ్చడి ఇదే అంశాన్ని తెలియజేస్తోందన్నారు.
కూటమి పాలనలో ప్రజలే ముందు: మన సంప్రదాయాలను కాపాడుకోవడం పూర్వీకుల నుంచి వస్తోన్న వారసత్వ సంపదగా సీఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన ఉత్సాహం, భవిష్యత్తు ఇవ్వాలని దేవున్ని ప్రార్ధిస్తున్నానని అన్నారు. సంస్కృతి మచరిపోతే ఉనికి కోల్పోతామని అన్నారు. నాగరిక ప్రపంచం, పోటీ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉండాలన్నారు. కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు, విశిష్ట వ్యక్తులను గౌరవించడం ద్వారా వారు చేసిన సేవకు గుర్తింపు ఇస్తే మరికొందరు ముందుకొస్తారన్నారు. గత తొమ్మిది నెలల నుంచి కూటమి పాలనలో ప్రజలే ముందు అనే ఆలోచనతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.
ఐసీసీ ఛైర్మన్ జైషాతో మంత్రి లోకేశ్ - అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై చర్చలు
హార్డ్ వర్క్ కాదని స్మార్ట్ వర్క్ అవసరం: ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరినీ లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని ఉగాది సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. పోటీ ప్రపంచంలో సాంకేతిక యుగంలో హార్డ్ వర్క్ కాదని స్మార్ట్ వర్క్ అవసరమని సూచించారు. ఒకప్పుడు ఐటీని, సెల్‌ఫోన్లను తాను ప్రోత్సహిస్తుంటే సెల్‌ఫోన్ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారన్నారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ కదిలే పరిస్థితిలో లేరన్నారు.
సెల్‌ఫోన్ వ్యసనం కాకూడదని అది ఓ ఆయుధంగా వినియోగించుకుంటే జీవితాల్లో వెలుగు వస్తుందని మార్పు కనిపిస్తుందని వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని అందరికీ అవమానాలే ఎదురయ్యాయని రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి ఉండదన్నారు. ఐటీ, హైటెక్ సిటీ గురించి ఆనాడు మాట్లాడానని ఇప్పుడు క్వాంటం వాలీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి ఆలోచన చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. సంపద కొందరికి పరిమితం కాకూడదని- అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది నెరవేర్చాలనేదే తన జీవిత ఆశయమని- అది నెరవేరి ప్రపంచానికి ఆదర్శంగా మార్చాలన్నదే తన అభీష్టమని చంద్రబాబు తెలిపారు.
మల్లవల్లిలో పరిశ్రమల జోరు - ఉద్యోగాలు, భూముల ధరలపై రైతుల్లో ఆనందం