CM CHANDRABABU NAIDU SPEECH: తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతో నాడు సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ధి చేశానని, నేడు అమరావతి నగర నిర్మాణం సైతం చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో తెలుగవన్ సంస్థ రజతోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, సమాజంలో మీడియా పాత్రను కొనియాడారు. యుగపురుషుడు ఎన్టీఆర్ను కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామికంగా సీఎం పదవినుంచి తొలగిస్తే ఈనాడు పత్రిక ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాటుపడిందని గుర్తు చేశారు.
నేడు కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు వ్యక్తిత్వ హననానికి, మహిళలను కించపరిచేలా రాస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. అలాంటి వాటిపై నియంత్రణ ఉండాల్సిందేనని నొక్కిచెప్పారు. సాంకేతికత పెరిగిన క్రమంలో దానిని అందిపుచ్చుకుని మంచి కార్యక్రమాలకు వాడాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ద్వారా ఎన్ని లాభాలున్నాయో, అంతమేర నష్టాలూ ఉన్నాయన్నారు. వ్యక్తిత్వ హననం చేసే మాధ్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాను తొలి సారి ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఆర్థిక సంస్కరణలు రావడం, వాటిని అందిపుచ్చుకుని సంపద సృష్టితో పాటు ఐటీని పెద్దఎత్తున ప్రోత్సహించి హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టానని గుర్తుచేశారు. ఆనాడు చాలామంది తన విజన్ అర్ధం చేసుకోలేదని చెప్పిన ఆయన, నేడు వాటి ఫలాలు కంటిముందు కనబడటంతో ఇప్పుడు మెచ్చుకుంటున్నారని వెల్లడించారు. సరైన సమయానికి సరైన నాయకుడు దేశ ప్రధానిగా మోదీ ఉన్నారని చెప్పారు.
2047 వికసిత్ భారత్లో తాము భాగస్వామ్యం అవుతున్నామని, దీనిలో భాగంగా అమరావతి నగర నిర్మాణం, ఏఐతో కూడిన క్వాంటమ్ వ్యాలీ వైపు పయనిస్తున్నామని వాటిని యువత అందిపుచ్చుకుంటే అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువరక్తం మన భారత్లోనే ఉందని, అది మనకు బలంగా మారుతుందని చెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో టాప్ 2 నగరాల్లో హైదరాబాద్, అమరావతి ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు, ఎన్ని జన్మలు ఎత్తినా తెలుగు వాడిగా పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం తెలుగు వన్ అధినేత రవిశంకర్ చంద్రబాబుకు సన్మానం చేశారు.
ఇదే కార్యక్రమానికి హాజరైన చినజీయర్ స్వామి తెలుగు వారికి కనీసం గుర్తింపంటూ లేని సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగువాడి సత్తాను దేశంలో నిలిపారని గుర్తు చేశారు. తెలుగు భాషను గౌరివించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మీడియాపైన, మనందరిపైన ఉందని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉండాలి - అప్పుడే జీవితంలో పైకి రాగలం: సీఎం చంద్రబాబు
ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు - కేబినెట్ సమావేశంలో ఆమోదం