CM Chandrababu Konaseema District Visit: సీఎం చంద్రబాబు నాయుడు శనివారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సీఐఐ సమ్మిట్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన సీఎం, అక్కడి నుంచే రాజమహేంద్రవరం వెళ్లాల్సి ఉంది. కానీ దిల్లీలో కార్యక్రమం ముగించుకుని విజయవాడకు బయల్దేరారు.
చంద్రబాబు పర్యటనకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. రాకపోకలు సాగించే వారితో పాటు పనిచేసే సిబ్బందిని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ, అనుమానిత వ్యక్తుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన కారణంగా రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన వివరాలివీ: రేపు మధ్యాహ్నం చంద్రబాబు రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిమిషాలకు ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దనే ప్రజాప్రతినిధులు, అధికారులను కలుస్తారు.
అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యేరు చెరువులో పూడికతీత పనులను పరిశీలించి ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. గ్రామం పరిధిలో ఉపాధి హామీ పథకం నిధులతో పూడిక తీసే ఉపాధి కార్మికులతో మాట్లాడనున్నారు.
1.20 నుంచి 2.05 గంటల వరకు ‘పేదల సేవలో’లో కార్యక్రమంలో భాగంగా (P4) బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత ఇచ్చే కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. 2.10 నుంచి 3.30 గంటల వరకు సీహెచ్ గున్నేపల్లి గ్రామస్థులతో మాట్లాడుతారు. 3.35 నుంచి 5.05 గంటల వరకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
5.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. సుమారు ఐదు గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామాల్లో ప్రజల రాకపోకలకు, వ్యాపారులకు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పెందుర్తి వెంకటేష్ అదికారులుకు సూచించారు.
సమష్టిగా చేస్తే ఏదైనా సాధ్యం - మహానాడుతో నిరూపితమైంది: సీఎం చంద్రబాబు
నా కష్టం నా కోసం కాదు - నన్ను నమ్మిన జనం కోసం: సీఎం చంద్రబాబు