CM Chandrababu Meet With Representatives Of Aqua Sector : భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని, 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. సుంకాల భారం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఆక్వా రంగం ప్రతినిధులతో సీఎం భేటీ : అమెరికా సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాల విధింపు వల్ల ఎదురవుతున్న కష్టాలపై రైతులు, ఎగుమతిదారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిదులతో సోమవారం రాత్రి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. ఇబ్బందులపై వారితో మాట్లాడారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది ఉన్నారని ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50లక్షల మంది ఆధారపడి ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సీఎంకు వివరించారు.
ఆక్వా ధరలు తగ్గించవద్దు : ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని తెలిపారు. దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెంచడం, అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టాలని సీఎం రైతులకు సూచించారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్‌కు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు రూ.220 ధరకు కొనుగోలుకు వ్యాపారులు సహకరించాలన్నారు.
దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతామని సీఎం హామీ ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు.
సమస్య పరిష్కారం కోసం కృషి : ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్‌లు, వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగు పడుతుందని రైతులు కోరారు. దీనికి సీఎం అంగీకారం తెలిపారు. ఆక్వారంగానికి ఇప్పుడు వచ్చింది ఊహించని, అనూహ్య సమస్య అని దీనికి భయపడకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని సీఎం సూచించారు. ఆక్వాలో ఉన్న అన్ని వర్గాలు కలిసి సమష్టిగా అడుగువేస్తేనే ఈ రంగం నిలబడుతుందని అన్నారు.
జెన్కో పైప్ లైన్ లీకేజీతో భారీగా రొయ్యలు మృతి - రైతులు ఆవేదన - Genco Pipe Leakage Prawns Dead