CM Chandrababu Letter to Central Minister over US tariffs: అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశ ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని అన్నారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయని గుర్తుచేశారు. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని వివరించారు. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని, ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ, వారికి అనుకూలంగా మారుతోందని తెలిపారు.
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ - గంటల వ్యవధిలోనే పతనమైన రొయ్యల ధరలు
దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (CVD) భారాన్ని మోస్తున్నారని వెల్లడించారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుందని చెప్పారు. అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని, దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోందన్నారు. గతంలో వచ్చిన ఆర్డర్‌లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి, కోల్డ్ స్టోరేజ్‌లు, పోర్టులలో ఉన్నాయని, కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుందని తెలిపారు.
యూరోపియన్ యూనియన్‌లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4–7 శాతం దిగుమతి సుంకంతో సహా నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని వివరించారు. కానీ వియత్నాం వంటి దేశాలు EUతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) కింద జీరో-డ్యూటీ పొందాయని, ఈ కారణంగా వియాత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్‌ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని లేఖలో చెప్పారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుంచి సీ ఫుడ్‌ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయని, అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయన్నారు.
గందరగోళ పరిస్థితిలో రైతులు: ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉందని, 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారని చెప్పారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని, ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు వచ్చాయన్నారు. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
అమల్లోకి ట్రంప్ ప్రతీకార సుంకాలు- వాటికి మాత్రం 51 రోజుల గ్రేస్ పీరియడ్!