CM Chandrababu Laid Foundation Stone For His Own Housein Amaravati : ప్రజారాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు పూజా కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు.
గతేడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైంది. జీ ప్లస్ వన్ మోడల్‌లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణ ప్లాన్‌ను లోకేశ్ కుటుంబసభ్యులకు వివరించారు.
హైకోర్టు, సచివాలయం మధ్యన : స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కల కోసం కేటాయించారు. నిర్మాణ బాధ్యతను ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. తాత్కాలిక హైకోర్టు, సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉండడం విశేషం. తూర్పున ఎన్10 రోడ్డు, ఉత్తరం వైపు ఈ6 రహదారులు ఉన్నాయి. పశ్చిమం, దక్షిణాన లేఅవుట్‌లోని అంతర్గత రోడ్లు వెళ్తాయి. ఈ ప్లాట్‌కు అనుకుని రోడ్డు ఉంది. దీని పక్కనే ఉన్న వెయ్యి చదరపు గజాల ప్లాట్‌ను మల్కాపురం గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు : ఈశాన్యంలో ఉండడంతో వాస్తు కోసం తీసుకున్నట్లు సమాచారం. దీన్ని సెక్యూరిటీ పోస్టు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వినియోగించనున్నారు. వేడుక తిలకించేందుకు పెద్దఎత్తున అక్కడికి వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు, జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాన్వాయ్ ఆపి రైతులందరినీ ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు, లోకేశ్‌లకు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కుటుంబ సభ్యులు భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉండవల్లి వెళ్లారు.
గుడ్‌న్యూస్ - అమరావతికి కేంద్రం రూ.4285 కోట్లు విడుదల
రాజధాని అమరావతి టూ చెన్నై- కోల్‌కతా రహదారుల విస్తరణకు టెండర్లు