CM CHANDRABABU HOUSE IN AMARAVATI: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిలో ఇంటి నిర్మాణ శంకుస్థాపన పనులు వేగంగా సాగుతున్నాయి. సచివాలయం వెనక E6 రహదారి పక్కనే ఉన్న సుమారు 2,500 గజాలలో ఇంటి నిర్మాణానికి ఈ నెల 9వ తేదీన భూమి పూజ చేయనున్నారు. తమ గ్రామ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం చేసుకుంటున్న నేపథ్యంలో వెలగపూడి వాసులు హర్షం వ్యక్తం చేశారు.
భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు ధైర్యం చెప్పి మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులను దానంగా ఇచ్చారని రైతులు చెప్పారు. ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని, ఉడతా భక్తి కింద పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని రైతులు తెలిపారు.
అమరావతి ORR అప్డేట్స్ - 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ
శరవేగంగా రాజధాని పునర్నిర్మాణ పనులు: మరోవైపు రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతి పునర్నిర్మాణాన్ని మిషన్మోడ్లో చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలే రాజధాని అమరావతిలో 40 వేల కోట్ల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ పచ్చజెండా ఊపింది. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (LOA) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తికాగానే అమరావతిలో పనులు ప్రారంభం కానున్నాయి.
రాజధాని అమరావతితో పాటు గ్రామాల అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్థానికులకు ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ వంటి విషయాలపై ఇప్పటికే చర్చించారు. దీంతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతికి చుట్టు పక్కల ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలో రాజధాని అమరావతిలో కీలక నిర్మాణానికి సైతం ముందడుగు పడింది. పరిపాలన నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణంలో మొదటి దశకు APNRT సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల పదో తేదీ వరకు గడువిచ్చింది.