Chandrababu on P4 Program : జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ్టి రోజుల్లో సెల్‌ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మొట్టమొదట దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ముప్పాళ్లలో వెంకట్రావమ్మ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. వారి కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకున్నారు. ఆలోచన విధానంలో మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు అందరూ స్పందించారని గుర్తు చేశారు.
"జన్మభూమి పిలుస్తుంది రావాలంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆర్థికంగా పైకి వచ్చినవాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. అట్టడుగున ఉన్నవారికి చేయూత అందించాలి. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తా. నేనెప్పుడూ 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తా. నా ఆలోచన దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీల్లేదు. పేదరిక నిర్మూలన జరగాలి. తలసరి ఆదాయం పెరగాలి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉంటుంది. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. పేదలకు వైద్య సేవ కింద డబ్బులిచ్చి ఆదుకుంటున్నాం. స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చాం. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయింది. సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు.
"అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం కట్టాలి. సూపర్-6 కూడా అమలు చేయాలి. కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నా అన్ని పరిష్కరిస్తాం. ఇక్కడ ఐదుగురు మార్గదర్శులు, 41 బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. అట్టడుగున ఉన్నవారికి చేయూత అందించే బాధ్యత మార్గదర్శులదే. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఒక నేత విధ్వంసం వైపు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. మంచి చేసే నాయకుడు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. డ్రెయినేజీ సమస్య తీర్చేందుకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తా. భూగర్భ డ్రెయినేజీ నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu Muppalla Tour : జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే మార్గదర్శులను తెచ్చామని చంద్రబాబు వివరించారు. బంగారు కుటుంబాలను గుర్తించి ఆదుకుంటున్నామని చెప్పారు. తెలివితేటలతో పని చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో గుర్తింపు, గౌరవం కావాలని ప్రతిఒక్కరూ ఆశిస్తారని తెలిపారు. సమాజానికి మనం ఉపయోగపడితే గుర్తింపు, గౌరవం దానంతట అదే వస్తుందని అన్నారు. పేదరికంలో ఉన్నవారు బంగారు కుటుంబంలో చేరవచ్చని వారిని మార్గదర్శులు ఆదుకుంటారని పేర్కొన్నారు. బాగా పనిచేసిన మార్గదర్శులను గుర్తించి సన్మానిస్తానని తెలియజేశారు. సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత సంపన్నులదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'పీ-4 కార్యక్రమం ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది జరగలేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి వాటిని తగ్గించాలి. అందరూ పేదరికంలోనే పుట్టాం అవకాశాలను అందుకోవడమే ముఖ్యం. డబ్బు వల్ల సమాజంలో గుర్తింపురాదు, మంచిపని చేస్తేనే వస్తుంది. ఎస్సీ వర్గీకరణ జరగాలని 30 ఏళ్ల క్రితమే నిర్ణయించాం. అన్ని గ్రామాల్లో రోడ్లు బాగు చేశాం. ఇది మంచి మార్పు' అని చంద్రబాబు తెలిపారు.
వేదాద్రి-కంచల ఎత్తిపోతల పునరుద్ధరణ పనులకు రూ.15 కోట్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సుబాబుల్ పంటకు మద్దతుధర ఇచ్చే అంశం సమీక్షిస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధించామని గుర్తుచేశారు. పీ-4 ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ - ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: చంద్రబాబు