CM Chandrababu Decisions in Politburo Meeting : ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. జూన్ 12న వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా లక్షకు పైగా పింఛన్లు ఇవ్వాలని తీర్మానించింది. సంక్షేమ పథకాల అమలుకు త్వరలోనే క్యాలెండర్ విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మూడు గంటలపాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు. రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని తీర్మానించారు. దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నరేగా, నీరు-చెట్టు కింద పనులు చేసిన కార్యకర్తలకు పెండింగ్ బిల్లుల్ని వచ్చే మహానాడులోగా చెల్లించాలని నిర్ణయించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన 2,887 అక్రమ కేసుల్ని సమీక్షించి తొలగించేందుకు న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని, డిసెంబరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ కింద కేంద్రం తొలి విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను జతచేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
'పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు వినియోగిస్తున్న వివిధ యాప్‌లకు బదులుగా ఇకపై "మై టీడీపీ" పేరుతో ఒకే యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ అన్ని సదుపాయాలతో ఈ యాప్ ఉంటుంది.' -అచ్చెన్నాయుడు, మంత్రి
పహల్గాం ఉగ్రదాడిని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. మృతిచెందిన పర్యాటకుల ఆత్మశాంతికి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదుల పీచమణిచి, ప్రజల్లో నమ్మకాన్ని, దేశ ప్రతిష్ఠను పెంచిన ప్రధాని మోదీని పొలిట్‌బ్యూరో కొనియాడింది. ఆయనను, త్రివిధ దళాలను, వాటి అధిపతుల్ని, సిందూర్‌లో పాల్గొన్న ప్రతి సైనికుడిని అభినందిస్తూ తీర్మానం చేసింది.
టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు - ప్రతినెలా సంక్షేమం అందేలా ‘ఏడాది క్యాలెండర్’
పార్టీ కార్యకర్తలు చనిపోతే బీమా మొత్తాన్ని వీలైనంత త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరోలో నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో అర్హత ఉన్న 50 వేల 235 మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.349 కోట్లు ఆర్థికసాయం అందజేశామని తెలిపారు. 11 మాసాల్లో రాష్ట్రానికి 8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు హామీ అమలుకి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ పరిశ్రమలో, ఏ ఊరిలో, ఏ జిల్లాలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చామన్న స్పష్టమైన సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.