CHANDRABABU COMMENTS ON POLITICS: రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు, ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్ధం కావట్లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో పలు విషయాలు చర్చించిన సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
తప్పు చేసినవారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: అదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనమూ వేధించటం సరికాదన్నారు.
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందన్నారు. నేరం రుజువయ్యాక ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించటమే తమ విధానమన్న చంద్రబాబు, రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
నేరస్థుల్ని ఏకం చేస్తున్న జగన్: విజయ్ మాల్యా లాంటి ఆర్ధిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయారని, అదే కోవకు చెందిన జగన్ రాష్ట్రంలోనే ఉంటూ ఇతర నేరస్థుల్ని ఏకం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగు తొడుక్కున్న ఒక నేరస్థుడు ఇతర నేరస్థులందరికీ అండగా నిలుస్తానంటున్నాడని దుయ్యబట్టారు. ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే అర్ధం చేసుకోవాలన్నారు.
పవన్‌తో ఏకాంతంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు: కేబినెట్ ముగిశాక మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సీఎం చంద్రబాబు కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. కడప మహానాడు నిర్వహణపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు, ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతను మహానాడు చాటి చెప్పిందని తెలిపారు.
ప్రజా తీర్పునకు ఏడాది - చప్పట్లు కొట్టి చంద్రబాబుకు మంత్రుల అభినందనలు