CM Chandrababu Comments at Vadlamanu: బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదే అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీకి మొదట్నుంచీ వెన్నెముక బీసీ వర్గాలే అని చెప్పారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామని, మోదీ, పవన్, తాను కలిసి వెనుకబడినవర్గాల అభ్యున్నతికి పని చేస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం: కార్పొరేషన్లు పెట్టి మరీ బీసీ కులాలకు మేలు చేస్తున్నామని, ఎన్టీఆర్ హయాంలో బీసీలకు గురుకుల పాఠశాలలు వచ్చాయని గుర్తు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 9 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, విదేశాల్లో చదువుకునే వారికి రూ.15 లక్షలు సాయం చేస్తున్నామని అన్నారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాసే వారికి అండగా ఉన్నామని తెలిపారు. అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, బ్యాచ్‌కు 500 చొప్పున కోచింగ్ ఇస్తామని వెల్లడించారు. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.
ఉచితంగా సోలార్ ప్యానెల్స్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్న చంద్రబాబు, నేతన్నలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు కట్టుకునే వెనుకబడిన వర్గాలకు అదనంగా రూ.50 వేలు ఇస్తామని, ఎస్సీలకు ఇంటిపై ఏర్పాటుకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఇస్తున్నామన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని పార్థసారథిని కోరుతున్నానని అన్నారు. అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజానికి మనుగడ ఉండదని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉందని, ఖజానాలో డబ్బు లేదని తెలిపారు. తాను చేసిన పనులు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతాయన్న చంద్రబాబు, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు.
త్వరలో తల్లికి వందనం: రూ.64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి రూ.10 వేలు, రూ.15 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడ్డారంటే డ్వాక్రా సంఘాలే కారణమని, త్వరలో తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా జనాభా తగ్గిపోతోందని, ప్రతి కుటుంబానికీ పిల్లలే ఆస్తి అనేదాన్ని దంపతులు గుర్తించాలన్నారు. త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ వచ్చాకే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
రైతులకు విడతలవారీగా రూ.20 వేలు: ఉద్యోగాల్లో 33, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనకబడిన వర్గాల సంక్షేమమే అని చెప్పారు. ఈ ఏడాది లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమని, రైతులకు అండగా ఉంటామని, వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని అన్నారు. మే నెల నుంచి రైతులకు విడతలవారీగా రూ.20 వేలు ఇస్తామని వెల్లడించారు.
తప్పులు చేసేవారిపట్ల చండశాసనుడిగా ఉంటా: సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరిరోజు అని హెచ్చరించారు. తప్పులు చేసేవారి పట్ల చండశాసనుడిగా ఉంటానని, వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో భాగంగా వడ్లమానులో కులవృత్తులు చేసుకునేవారి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ప్రజావేదిక వద్దకు చేరుకుని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
రాష్ట్రానికి కొత్తగా రూ.31,617 కోట్ల పెట్టుబడులు - 32 వేల మందికి ఉపాధి
పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి : సీఎం చంద్రబాబు