CM Chandrababu ON Free Bus Scheme for Women: ఎన్ని కష్టాలున్నా పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలకమైన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులను అన్ని విధాలా ఆదుకొని రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, కార్యాలయాలు, పరిసరాల్లోని దుమ్ము దులపాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యాక్రమంలో భాగంగా కర్నూలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. నగరంలోని ధనలక్ష్మీనగర్‌లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యానవనం ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం సీ-క్యాంపు రైతు బజార్‌కు వెళ్లిన చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక సభాస్థలిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, డ్రోన్లు, ఇతర పరికరాల స్టాళ్లను పరిశీలించారు.
నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ రైతుబజార్లను ఏర్పాటుచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులోని రైతుబజార్‌ను 6 కోట్లతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే బాధ్యత డ్వాక్రా సంఘాలపై ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో 75 కేంద్రాలను ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను రీ సైకిల్ చేస్తామన్నారు. పల్లె పుష్కరిణి ద్వారా చెరువులను శుభ్రం చేస్తామన్నారు. బంగారు కుటుంబాలకు సాయం చేసే మార్గదర్శులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్న చంద్రబాబు పీ-4లో భాగంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులతో ఆయన ముచ్చటించారు. మార్గదర్శులను శాలువ కప్పి సన్మానించారు.
రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం నిర్వహించాలి - అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు