Electronics City in AP : హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవాలో ఉన్న లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ యాపిల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ సిటీ రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర అంశాలపై శుక్రవారం దిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో పాటు, యాపిల్ సంస్థ ఎండీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల యజమానులతో చర్చించిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
"ఈ రోజు యాపిల్ ఎండీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థల యజమానులతో సమావేశం అయ్యాము. బెంగళూరు-హైదరాబాద్ కారిడార్‌లో లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ నిర్మించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఎంఓయూ చేసుకుంటాం. మూడు నెలల్లో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పాం. భూకేటాయింపులు ఖరారు చేసి ముందడుగు వేస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ కన్సార్షియంలో యాపిల్‌తో పాటు ఉత్పత్తిదారులంతా ఉంటారు. ఈ సిటీకి మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని" అని సీఎం చంద్రబాబు తెలిపారు.
"ఉద్యోగాల కల్పన, అభివృద్ధి బాధ్యత ఆ సంస్థలది. లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో విస్తృతస్థాయిలో పరిశ్రమలు వస్తాయి. సమీపంలో బెంగళూరు, పుట్టపర్తి, ఓర్వకల్లు, హైదరాబాద్ విమానాశ్రయాలు, మరోవైపు కృష్ణపట్నం పోర్టు ఉండటం దీనికి సానుకూలం. వీటి మధ్యలో మరో విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ రక్షణరంగ సంస్థలు చాలా వస్తాయి. ఓర్వకల్లులో సైన్యంతో పాటు వాణిజ్య అవసరాలకు తగ్గ డ్రోన్లు తయారు చేస్తాం. దీన్ని దేశానికి ఒక హబ్‌గా సిద్ధం చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన వివిధ మంత్రులతో జరిగిన సమావేశాల వివరాలను వెల్లడించారు. విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పర్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. కర్నూలు- ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని కోరినట్లు చెప్పారు. తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని, తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరితే పరిశీలిస్తామని చెప్పారు. కుసుమ్ కింద 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారబోతోందని గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు.
'రాజధానిగా అమరావతిని నోటిఫై చేయండి' - అమిత్ షాను కోరిన చంద్రబాబు
కేంద్రం అనుమతి ఇవ్వగానే బనకచర్ల పనులు ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు