CM Chandrababu About Yoga Day Program at Visakhapatnam: విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలన్నారు. కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలని సూచించారు.
‘యోగాంధ్ర-2025 థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలి. దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 వరకు యోగా మాసం పాటించాలి. ఈ నెల రోజులూ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగాభ్యాసం జరగాలి. దీన్ని పూర్తిచేసుకున్న వారిని గుర్తిస్తూ ధ్రువపత్రం ఇవ్వాలి. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి. విద్యార్థులనూ భాగస్వాములుగా చేయాలి. ఈ కార్యక్రమం తర్వాత కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి.' -ముఖ్యమంత్రి చంద్రబాబు
యోగాంధ్ర కార్యక్రమం - రామధనుస్సు ఆకృతిలో 1500 మంది ఆసనాలు
లక్షల మంది పాల్గొనేలా విశాఖలో ఏర్పాట్లు : 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్‌కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఆర్‌కే బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ముమ్మర చర్యలు చేపడుతుంది.