Clashes Between Husband and Wife with Body Shaming : పెళ్లై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. కొద్ది రోజులు సాఫీగా సాగిన వారి కాపురంలో భర్త ఈసడింపులు పెరిగాయి. తనకు తగిన జోడీ కాదు అంటూ సూటిపోటి మాటలు. ఇంత బరువైన భార్యను భరించాలంటే రెండు రెట్లు ఎక్కువగా సంపాదించాలంటూ కుటుంబ సభ్యుల ముందు విమర్శలు. మొదట్లో సరదాగా తీసుకున్నా, క్రమంగా చేయి చేసుకునేంత వరకు చేరడంతో భార్య భరించలేకపోయింది.
బాగా చదువుకున్నాడు. ఫార్మా కంపెనీ ఉద్యోగమని పీజీ చేసిన యువతి అతడిని వివాహం చేసుకుంది. మొదటి పిల్లాడు తెల్లగా పుట్టాడు. రెండోబిడ్డ నలుపు రంగుతో ఉండటంతో భర్తలో అనుమానం ప్రారంభమైంది. చిన్న కుమారుడిని చిన్న చూపు చూడటం మొదలుపెట్టాడు. కూతురి బాధను చూసి తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే. సంతోషంగా సాగాల్సిన కాపురంలో బాడీ షేమింగ్ చిచ్చు పెడుతోంది. ఒకరినిఒకరు నిందించుకుంటూ చేతులారా సంసారాన్ని బజారున పడేసుకుంటున్నారంటూ ఒక పోలీసు అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి పీటలపై నాజుగ్గా కనిపించిన భార్య పిల్లలు పుట్టాక లావు అయ్యిందని, బంధువుల ఇళ్లల్లో పార్టీలకు వెళ్లాలంటే నామోషీగా ఉందంటూ ఒక ప్రబుద్ధుడు విడాకులు కావాలంటూ న్యాయవాది వద్దకు వెళ్లాడు.
ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో కౌన్సెలింగ్‌తో అతడిలో మార్పు తెచ్చామని మహిళా ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తల్లో చాలా మంది ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తున్నారు. పరస్పరం మానసిక, శారీరక లోపాలను ఎత్తిచూపుతూ కలహాల కాపురం సాగిస్తున్నారు. సిటీలో ఏటా వరకట్న, గృహహింస వేధింపులు తదితర అంశాలపై 7 మహిళా పోలీస్ స్టేషన్లో 5,000 నుంచి 6,000 పైగా ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిలో 2,000 నుంచి 3,000 మంది భార్యాభర్తలను కౌన్సెలింగ్ ద్వారా కలుపుతున్నారు.
సరైన టైంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి : -
- హైదరాబాద్ నగరంలో ఇటీవల నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భార్యకు గుండె సమస్య ఉందని చెప్పకుండా వివాహం చేశారని వేధించడం భరించలేకపోయింది. చిన్నతనంలో ఆరోగ్య సమస్య ప్రస్తుతం లేదని చెప్పినా అతడు పట్టించుకోలేదు.
- ఎంబీబీఎస్ చేసిన ఓ యువకుడు వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు. పెళ్లి చూపులకు వెళ్లి వచ్చాక బట్టతల కారణంగా యువతి వివాహానికి నిరాకరించినట్టు తెలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాడు.
- నగర యువకుడు సూర్యాపేట యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో రెండు సంవత్సారాలుగా సజావుగా కాపురం చేశాడు. రాకపోవడంతో నల్లగా ఉన్నావంటూ హేళన చేయడం మొదలుపెట్టాడు. కాపురం చేయలేనంటూ భార్యను పుట్టింటికి పంపాడు.
- హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పెళ్లికి వచ్చిన స్నేహితురాళ్లు అతడు పొట్టిగా ఉన్నాడని, సరైనోడు కాదని కామెంట్ చేశారు. ఆమె భరించలేకపోయింది. పెళ్లి అయిన ఆర్నెల్లకే పుట్టింటికి చేరింది. ఇద్దరూ విద్యావంతులు, సంపాదించే వారు కావటంతో ఒంటరిగా బతికుతామనే ధీమాతో ఉంటున్నారు. సర్దుకొనిపోలేక, సర్దిచెప్పే వాళ్లు లేక ఆలుమగల మధ్య దూరం పెరుగుతోందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. సరైన టైంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అంటున్నారు.
ఈ కష్టం ఏ భర్తకు రావొద్దు- భార్య వేధింపుల తట్టుకోలేక విడాకుల కోసం 15ఏళ్ల పాటు పోరాటం- చివరకు!