ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే వంద శాతం జాబ్ గ్యారెంటీ!
చర్లపల్లిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - యువతకు ఉద్యోగాలు కల్పించడంలో సీపెట్ రారాజు - సొంత పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్న యువత

Published : October 14, 2025 at 1:28 PM IST
CIPET Provide Placements : చర్లపల్లిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) సంస్థ ఉద్యోగ కల్పనలో రారాజుగా నిలుస్తోంది. యువతకు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ అందిస్తూ, ఉపాధి అవకాశాలను వారికి కల్పిస్తోంది. ఏటా వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ ఉద్యోగాల్లో చేరుతున్నారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా వారు రాణిస్తున్నారు. దీంతో నలుగురికి ఉపాధిని కల్పిస్తూ వారి జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్నారు.
నైపుణ్యాలకు పదను :
- చర్లపల్లిలోని బీఎన్ రెడ్డి నగర్లో 1987లో సీపెట్ సంస్థను ఏర్పాటు చేశారు.
- యువతకు ప్లాస్టిక్, అనుబంధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.
- ఇక్కడ రెగ్యులర్ కోర్సులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిద కార్పొరేషన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షార్ట్‌టర్మ్ కోర్సులు నిర్వహిస్తున్నారు.
- ప్రశాంత వాతావరణం, విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, అత్యాధునిక ల్యాబ్, టూల్ సెంటర్, వసతి గృహంతో ఈ కేంద్రం అనేది నడుస్తోంది.
- అతి తక్కువ ఫీజుతోనే ఎందరో పేద విద్యార్థులు ఇక్కడ శిక్షణను పొందుతూ ఉద్యోగాలు సాధించారు.
- పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఇక్కడ డిప్లొమో కోర్సుల్లో చేరవచ్చు
- గతేడాది అన్ని కోర్సుల్లో కలిపి 161 మంది శిక్షణ పొందితే, 161 మందికీ ఉద్యోగాలు వచ్చాయి.
- ఈ సంస్థ ఐదారేళ్లుగా వందశాతం ప్లేస్మెంట్లతో దూసుకుపోతుంది.
ఏటా అడ్మిషన్లు : సీపెట్‌లో అడ్మిషన్లు పొందాలంటే క్యాట్(సీపెట్ టెక్నీషియన్ టెస్ట్) పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఏటా ఫిబ్రవరిలో సీపెట్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయాల్సి ఉంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు.
కోర్సుల వివరాలు :
- పీజీ(2 సంవత్సరాలు)
- ప్లాస్టిక్ ప్రాసెసింగ్, టెస్టింగ్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్(సీఏడీ/సీఏఎం)
- పోస్ట్ డిప్లొమో(1.5 సంవత్సరాలు): ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్(సీఏడీ/డీఏఎం)
- డిప్లొమో(3 సంవత్సరాలు): ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ
ఏయే అవకాశాలు? :
- ప్లాస్టిక్ డిప్లొమాలు పూర్తి చేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
- ఓల్టాస్, మిల్టన్, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, సెలో, మారుతీ సుజుకీ, ఐఎఫ్బీ, రిలయన్స్, బీపీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, టాటా, బటర్ ఫ్లై తదితర సంస్థలు వీరిని ఎంపిక చేస్తాయి.
- ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జూమర్ గూడ్స్, మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో పని చేయడానికి ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టున్నవారు ఎంతో అవసరం.
- అందుకే ఈ కోర్సులు చేసినవారికి ఉపాధిలో ఢోకా లేదు. కొన్నేళ్ల అనుభవంతో మంచి వేతనాలు అందుకోవచ్చు.
- అలాగే సొంతంగా చిన్న పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
"పదో తరగతి పూర్తి చేసినవారు మూడేళ్ల డిప్లొమో పూర్తి చేస్తే ఉద్యోగం సాధించొచ్చు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. 24 గంటల భద్రత అనేది ఉంటుంది. వివిధ కంపెనీలు నేరుగా ఇక్కడికి వచ్చి విద్యార్థులను పరీక్షిస్తాయి. నేరుగా వారికి ఉద్యోగాలు కల్పిస్తాయి." - రవి, ప్రిన్సిపల్, డైరెక్టర్
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం అందించే కోర్సు - పూర్తి వివరాలు చూసేయండి?

