Illegal Cigarette Seize In Vizianagaram District: సిగరెట్ల అక్రమ రవాణాను అధికారులు గుట్టురట్టు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం సుంకరిపేట సమీపంలోని ఓ గోదాములో దిగుమతి చేసిన భారీ సరకును శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలోని సిబ్బంది బృందాలు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.72 కోట్ల పైనే ఉంటుందని ఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి సిగరెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు అందిన సమాచారంతో నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
అగ్గిపెట్టెలో సిగరెట్లు: పది రోజుల కిందట బిహార్ నుంచి కొంత అక్రమ సరకు రాగా గురువారం మరో వాహనంలో తీసుకొచ్చిన సరకు దించుతుండగా పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. అగ్గిపెట్టెల వ్యాపారం ముసుగులో వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. గోదాముల్లో నిల్వ చేసిన 3.15 లక్షల సిగరెట్ పెట్టెలను సీజ్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో తయారైన నాసిరకం సిగరెట్లు సహా దేశంలో తయారైన సిగరెట్లను ఇక్కడికి రహస్యంగా రవాణా చేస్తున్నారని, అక్కడ నుంచి వ్యాపారులకు విక్రయిస్తున్నారని, దీని వెనక పెద్ద ముఠా ఉందని అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతోందని భావిస్తున్నారు.
బ్రాండెడ్కు ఏమాత్రం తీసిపోదు - జోరుగా నకిలీ సిగరెట్ల వ్యాపారం