Cibil Score For Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాజీవ్ యువవికాసం పథకం పేరుతో రాయితీ రుణాలు వివిధ కార్పొరేషన్ల నుంచి ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్లు) రాయితీపై ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 40,270 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ల వెరిఫికేషన్, అర్హులైన వారి ఎంపిక ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోరు 700 దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు.
ఆ స్కోర్ ఆధారంగానే ఎంపిక : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీవో ఆఫీస్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఆయా బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు, అభ్యర్థుల బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపుల ఆధారంగా లోన్లను అందిస్తామని తేల్చారు. గురువారం బెల్లంపల్లి పరిధిలోని అన్ని బ్యాంకులు, ఆకెనపల్లిలోని బ్యాంకులో దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్‌ను ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకు సిబ్బంది సేకరించారు. అందుకు పాన్‌కార్డును ప్రామాణికంగా చేసుకుని ఓ జాబితాను తయారు చేశారు.
అయోమయంలో అభ్యర్థులు : సిబిల్ స్కోర్ ప్రామాణికంగా రాజీవ్ యువ వికాసం రుణాలను అందిస్తామనడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, రుణాల(లోన్) చెల్లింపులు ఉంటేనే సిబిల్ స్కోర్ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పలువురు స్వయం ఉపాధికి ఈ పథకం చేయూతగా ఉంటుందనే ఉద్దేశంతో రుణాలకు దరఖాస్తులు చేశారు. బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మండల కమిటీలనేవి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. దీనికి ప్రత్యేకంగా మౌఖిక పరీక్షలు(ఇంటర్య్వూలు) నిర్వహించాలని బ్యాంకర్లు కోరినప్పటికీ సర్కారు అందుకు సుముఖంగా లేనట్లుగా సమాచారం. ఆయా మండల కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థులకు లోన్లను అందించనున్నారు.
బ్యాంకు నుంచి రుణాలు తీసుకోని వారికి : అదే గ్రామంలో మరికొందరు లోన్లు తీసుకున్నారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించడం లేదు. దీంతో వారి సిబిల్ స్కోర్ 630 లోపు చూపిస్తోంది. బెల్లంపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో బ్యాంకర్లు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసిన ఓ యువకుడి సిబిల్ స్కోరును పరిశీలించారు. ఈ యువకుడు ఇప్పటివరకు బ్యాంకుల నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు. బ్యాంకు అకౌంట్ల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఈయన సిబిల్ స్కోర్ 130 చూపించింది. ఆ గ్రామంలో రుణం తీసుకోని వారే ఎక్కువమంది ఉన్నారు. వారందరికీ సిబిల్ స్కోర్ ఈ విధంగా చూపిస్తోంది. ఇలాంటి వారు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ యువవికాసం దరఖాస్తులను బ్యాంకులకు పంపాలని ఆదేశాలు!
మీకు తెలుసా? : ఆ స్కోర్ లేకున్నా, బ్యాంకులో బాకీ ఉన్నా 'రాజీవ్ యువ వికాసం' రాదట