Chilli Sales in Cold Storages Without Officials: వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో శీతల గోదాముల్లో ఉన్న మిర్చి విక్రయాలకు మంచి గిరాకీ ఏర్పడింది. మిర్చి ఎగుమతి, దిగుమతి, కార్మిక, కాపలా సంఘాల అభ్యర్థన మేరకు మే 12వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
శీతల గోదాముల వద్ద విక్రయాలు: వేసవి ఎండల్లో పనులు చేయడం కష్టమని సెలవులు తీసుకున్న వ్యాపార, కార్మిక సంఘాల నాయకులు శీతల గోదాముల వద్ద విక్రయాలు జరుపుతున్నారు. మే 12 నుంచి ఇప్పటివరకు 1.60 లక్షల మిర్చి బస్తాలు విక్రయించినట్టు అంచనా. ఇవికాక అదనంగా మరో 50,000 బస్తాలు అమ్మినట్టు వ్యాపారవర్గాలు తెలిపాయి. నిత్యం హీనపక్షం 3000 బస్తాల చొప్పున అమ్ముతున్నారని చెబుతున్నారు.
శీతల గోదాముల వద్ద అధికారుల పర్యవేక్షణ ఉండదు. జోరుగా జీరో వ్యాపారంలో మిర్చిని అమ్మినా అడిగే వారుండరు. ఏయే శీతల గోదాముల్లో ఎంత మేర విక్రయాలు జరుగుతున్నాయో ఆరా తీయాల్సిన అధికారులు ఆ పని చేయడం లేదు. పరోక్షంగా వ్యాపారులకు సహకరిస్తున్న పరిస్థితి. నెల రోజుల తరువాత మిర్చియార్డు ఇచ్చే రిటర్న్స్ ద్వారానే ఎవరెవరు ఎంతమేరకు వ్యాపారం చేశారో తెలుస్తుంది.
వ్యాపారులకు ఇష్టారాజ్యంగా: రైతులు సరకు తీసుకొస్తే కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నా వాస్తవానికి నిల్వ బస్తాలనే విక్రయిస్తున్నారు. సెలవుల కారణంగా ఈ-నామ్ ద్వారా బిడ్డింగ్ జరగడం లేదు. దీంతో వ్యాపారులకు ఇష్టారాజ్యంగా ఉంది. మిర్చి సీజన్లో కంటే ఇప్పుడు కొన్ని రకాల ధరలు పెరిగాయి. తేజ, ఆర్మూర్, 334 రకాలకు డిమాండ్ బాగుంది. ఎగుమతి ఆర్డర్లు అందుకున్న వ్యాపారులు అవసరాన్ని బట్టి ఎగుమతి చేస్తున్నారు.
341 రకం మిర్చికి దేశీయంగా కారం ఉత్పత్తి చేయడానికి డిమాండ్ ఉంది. దీని గతంతో ఉన్న ధరతో పోలిస్తే ఇప్పుడు కొంత పెరిగింది. మిర్చియార్డు పరిధిలోని శీతల గిడ్డంగుల్లో సెలవులు ఇచ్చే సమయానికి సుమారు 49.70 లక్షల బస్తాల వరకు ఉండగా ప్రస్తుతం 48.11 లక్షల బస్తాలు ఉన్నాయని చెబుతున్నారు. సెలవుల్లో సుమారు రూ. 29 లక్షల వరకు లావాదేవీలు నడిచినట్టు అంచనా.
పెట్టుబడి రూ.15 వేలు - దక్కేది రూ.9-13 వేలే - మిర్చి రైతు కంట కన్నీరు