Children Falling Ill Due to Climate Change : వాతావరణ మార్పులతో పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 0 నుంచి 5 సంవత్సరాలలోపు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బాధపడుతున్నారు. మొన్నటి వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడిన పిల్లలు, వృద్ధులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు.
నీటి శుద్ధిలో లోపాలు : ఎండలు తగ్గినా ఉక్కబోత ఉండడంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీంతో అప్పటి దాకా ఆడిపాడుతూ ఇల్లంతా కలియ తిరిగిన చిన్నారులు జ్వరాలు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక్కసారిగా ఎండలు తగ్గడంతో పాటు నీటి శుద్ధిలో లోపాలతో సమస్య నెలకొంటోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోధన ఆసుపత్రిలో పిల్లల విభాగంలో ఆయా లక్షణాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చేవారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది.
వివరాలు ఆరాతీస్తే : జూన్ నుంచి వచ్చే వాతావరణ మార్పులతో వ్యాధుల బారిన పడి శిశువుల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల పరిధిలో ఎక్కువ సంఖ్యలో రోగులు ఏ లక్షణాలతో వస్తున్నారో వివరాలను పక్కాగా నమోదు చేస్తే భవిష్యత్‌లో ముప్పును అధిగమించే వీలు ఉంది. సీజన్ మార్పుతో ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని బోధన ఆసుపత్రి పర్యవేక్షణ అధికారిణి డాక్టర్ ఫరీదా సూచనలు చేశారు. శీతాకాలం, వానాకాలం గట్టెక్కే వరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
కామారెడ్డి మండలం పాతరాజంపేటకు చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఇంటి వద్ద బాబుకు ఔషధాలు ఇచ్చినా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో కుటుంబీకులు బోధనాసుపత్రికి తీసుకురాగా ఇక్కడ పలు పరీక్షలు చేశారు. జబ్బు చేయడానికి కారణం వెల్లడి కాలేదు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నాలుగు సంవత్సరాల బాలుడు విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నారు. 6 రోజుల కిందట ఇంటి వద్దే చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వారం రోజులుగా బాబు ఆహారం తీసుకోవడం లేదని కుటుంబీకులు తెలిపారు.
పగలంతా ఎండలు - రాత్రి చలితో అనారోగ్య సమస్యలు - ఈ జాగ్రత్తలు పాటించాలి