Children Are Dying in Car Due To Neglect OF Adults : కారు, ఆటో, బైక్ ఏది కనిపించినా చిన్న పిల్లలకు ఆటబొమ్మగా భావిస్తారు. పనిలో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పిల్లలేం చేస్తున్నారనేది గమనించారు. ఆటల్లో నిమగ్నమయ్యారనే ఉద్దేశంతో చూసీచూడనట్టు వదిలేస్తారు. ఈ చిన్న పొరపాటు కారణంగా పసికూనల ప్రాణాలు పోతున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతున్నాయి. చేవెళ్లలో బంధువుల ఇంట వివాహానికి వెళ్లిన చిన్నారులు తన్మయశ్రీ, అభినయశ్రీ కారులో ఆడుకుంటుండగా లాక్ పడి బయటకు రాలేకపోయారు. లోపల ఊపిరాడక ఇద్దరూ మృతి చెందారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అధిక శాతం కేసుల్లో తల్లిదండ్రుల ఉదాసీనత, వాహనదారుల నిర్లక్ష్యం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది.
- మీర్‌పేట్ భూపేశ్‌గుప్తానగర్‌లో ఆరు బయట 2 ఏళ్ల పాప ఆడుకుంటోంది. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేల్చారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాంబాయిగూడెంలో ఆడుకోవడానికి మధ్యాహ్నం బయటికి వెళ్లిన 3 ఏళ్ల చిన్నారి రాత్రయినా తిరిగిరాకపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. చివరికి కారులో చూడగా పాప మరణించి ఉంది.
కారు డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్, వాహనంలో ఊపిరాడకుండా చిన్నారుల మరణాలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి.
చిన్న జాగ్రత్తతో జీవితం సేఫ్ : చిన్న పిల్లలు పార్క్ చేసిన కార్ల చుట్టుపక్కల ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. ఇది గమనించక డ్రైవర్లు కారు ముందుకు/ వెనక్కు తీయడంతో టైర్ల కింద పడిపోయి చనిపోతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే వాహనం స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కారు సమీపంలో ఉన్నా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆడుకుంటూ ఆకస్మాత్తుగా దూసుకొస్తుంటారు. పిల్లలు సంచరించే ప్రదేశంలో కారు వేగాన్ని తగ్గించుకోవాలి. కారు స్టార్ట్ చేసిన వెంటనే కదిలించకుండా ముందుగా హారన్ మోగించాలి. దీంతో ఆ శబ్దానికి కింద ఎవరైనా పిల్లలు, జంతువులుంటే అప్రమత్తమయ్యి పక్కకి జరగడానికి అస్కారం ఉంటుంది.
చాలా మంది కారు డోర్లు లాక్ చేయకుండా వెళుతుంటారు. పిల్లలు అందులోకి వెళ్లి ఆడుతుంటారు. ఆ తర్వాత డోర్ లాక్ అవుతుంది. డోర్ వేసిన కారులో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటుంది. దీనికి కార్బన్ మోనాక్సైడ్ కూడా తోడవుతుంది. దీంతో ఊపిరాడదు. ఈ కారణంగా పిల్లలు చనిపోతున్నారు.
- పెద్దల పర్యవేక్షణ లేకుండా కారు లేదా దాని చుట్టుపక్కల పిల్లల్ని ఉంచడం ప్రమాదకరం.
- కారు డోర్ లాక్ చేసేటప్పుడు మొత్తం చూసి ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.
- పిల్లలు ఎప్పుడైనా తప్పిపోతే ముందుగా కారులో వెతకాలి.
- చాలా మంది కారులో ఏసీ వేసుకుని డోర్లు పూర్తిగా లాక్ చేసి పడుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. అరగంట కంటే ఎక్కువ సమయం మూసి వేసిన కారులో ఉంటే ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది.
ఇంటా, బయటా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నగర ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి తెలిపారు. ఆరుబయట, పార్కింగ్ ప్రదేశాల్లో ఆడుకునేటప్పుడు వారి కదలికలను గమనిస్తుండాలని సూచించారు. కార్లను నిలిపేటపుడు పూర్తిగా డోర్ లాక్ చేయాలని, పిల్లలు ఆడుకుంటూ కారులోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా లాక్ పడితే ఆక్సిజన్ అందక ప్రాణం మీదకు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.
ఈ వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త - వైద్యనిపుణుల సూచనలు ఇవే
వామ్మో! ఏంటీ ఈ ఎండలు - మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి