Child Abuse and POCSO Cases Increasing in AP : పోక్సో, నిర్భయ ఇలా చెప్పుకుంటూ పోతే అతివలకు అండగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కీచకులకు ముక్కుతాడు వేయలేకపోతున్నాయి. సమాజంలో అన్నెం పున్నెం ఎరుగని పాలబుగ్గలపై తరచూ అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. ఆ చిన్నారుల కన్నీటి కథలోకి వెళ్తే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. చేయి పట్టి నడిపించే వారే ఈ లైంగిక దాడుల వెనుక ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తాత వరుసయ్యే ఓ కీచకుడు తన ఎదురింట్లో ఉండే ఓ చిన్నారిపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రిలో చేర్పిస్తే అసలు విషయం బయటడింది. అలాగే మద్దిపాడు మండలంలోని ఓ పాఠశాల విద్యార్థినులకు చెడు స్పర్శ ఇలా ఉంటుందమ్మా అని అధికారిణి చెబుతుండగా ఓ చిన్నారి భోరుమని విలపించింది. ఏమైందమ్మా అని విచారిస్తే పాఠాలు చెప్పే ప్రబుద్ధుడే తనపట్ల నిర్దయగా వ్యవహరించాడని ఆమె వాపోయింది.
ఒకే పాఠశాలలోని నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు
ప్రకాశం జిల్లాలో పోక్సో కేసులు కలవర పెడుతున్నాయి. ఒక్క మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలల్లోనే ఏడు కేసులు వెలుగుచూశాయి. ఇక కనిగిరి డివిజన్‌లో గడచిన పది నెలల్లో ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మహిళా జనాభా దాదాపు 11.27 లక్షలు ఉంది. పదో తరగతి వరకూ చదువుతున్న బాలికలు సుమారు 82 వేలమంది ఉన్నారు. అలాగే ఇంటర్ చదువుతున్న వారు దాదాపు 19 వేల మంది వరకూ ఉన్నారు.
ఇటీవల జిల్లా వ్యాప్తంగా నమోదైన పోక్సో కేసుల మూలాల్లోకి వెళ్లి విచారిస్తే తాత, మావ, బంధువులే నిందితులుగా ఉంటున్నారు. కనిగిరి పట్టణంలోని పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అత్యాచారానికి యత్నించగా ఆ బాలిక తప్పించుకుంది. తప్పు అని చెప్పాల్సిన పెద్దలే తమ ఇంటిపై దాడి చేయించారని బాధితురాలు వాపోయింది.
ప్రేమ జంటలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు - ఆ నలుగురికి యావజ్జీవ ఖైదు
ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల్లో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా పోలీస్‌స్టేషన్‌కు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కేసులొస్తున్నాయి. కేసులు నమోదు చేయించి శిక్ష పడేలా చూడాల్సిన గ్రామ పెద్దలు కూడా పంచాయితీలు పెట్టి తీర్పులిచ్చేస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో తండ్రి వయస్సున్న వ్యక్తి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడితే కుల పెద్దలు మాత్రం బాధితురాలి ఆత్మాభిమానానికి రూ.5 లక్షల విలువ కట్టారు. అలాగే పామూరు పట్టణంలో ఓ యువకుడు, ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత రాజీ చేసుకుని హాయిగా తిరుగుతున్నాడు.
పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంచి, చెడు స్పర్శపై అవగాహన కార్యక్రమాలు సైతం నామమాత్రంగా జరుగుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కూడా అంతంతమాత్రమే చేపడుతున్నారు. గతంలో మద్దిపాడు ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఓ పాఠశాలలో మంచి, చెడు స్పర్శపై అవగాహన నిర్వహిస్తుండగానే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడులకు గురైతే తల్లిదండ్రులు ధైర్యంగా పోలీసులను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని కనిగిరి డీఎస్పీ పి. సాయిఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. అలాగే మహిళలకు సమస్య ఉంటే వెంటనే 1098 నంబరుకు ఫోన్‌చేస్తే సత్వరం స్పందించే వీలుంటుంది.
చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తిపై పోలీసుల నిఘా - ఆ వీడియోలు చూస్తే అరెస్టే! - Pocso Cases in AP