CENTRALLY SPONSORED SCHEMES IMPLEMENTATION: కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర వాటా నిధులతో అమలుచేస్తున్నా వాటిని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గతంలో ఆ పథకాల పేరుతో నిధులు తీసుకుని దారి మళ్లించేశారు. ఆ పథకాలకు రాష్ట్రవాటా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా గత ఐదేళ్లలో 39,642 కోట్ల రూపాయలు మేర కోత పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే కేంద్ర ప్రాయోజిత పథకాలు గాడిన పడ్డాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం 14,479.31 కోట్ల రూపాయలను వెచ్చించి 82 కేంద్ర ప్రాయోజిత పథకాలకు పునరుజ్జీవం పోసింది.
జగన్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ చెల్లించడంతో పాటు, కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సకాలంలో విడుదల చేస్తూ ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత నెలాఖరు వరకు 17,878.24 కోట్ల రూపాయలను 134 కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసింది. రైతులు, విద్యార్థులకు లబ్ధి కలిగేలా వ్యవస్థను సంస్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మంచినీటి సౌకర్యాలు మెరుగు పరిచేలా అభివృద్ధికి బాటలు పరిచింది.
2024 జూన్‌లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి 95 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి 8,695 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా గత ప్రభుత్వం ఆపేసింది. అలాంటిది ఇప్పుడు ఏడాదిలోనే వేల కోట్ల రూపాయలు వెచ్చించడమే కాకుండా లక్షలమందికి చేయూత అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన:
నాడు: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పల్లెల్లో నాడు రహదారుల నిర్మాణం నిలిచిపోయింది. 125.32 కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం ఆపేసింది. 916 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు స్తంభించిపోయాయి.
నేడు: ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని గాడిన పెట్టింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయడమే కాకుండా మరో 560.39 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించింది. ఫలితంగా 435 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తయింది.
సమగ్రశిక్షా అభియాన్:
నాడు: గత ప్రభుత్వంలో సమగ్రశిక్షా అభియాన్ పథకం పనులు సరిగ్గా సాగలేదు. 238.06 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉండిపోయాయి. పాఠశాలల్లో వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోలేదు.
నేడు: కూటమి ప్రభుత్వం రాగానే పాత బిల్లులు చెల్లించడంతో కేంద్రం మరో 1,240.10 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్ర వాటా కలిపి 1,893.50 కోట్ల రూపాయలు వెచ్చించడంతో 35 లక్షలమంది విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించే ప్రక్రియ ఊపందుకుంది.
పోషణ 2.0:
నాడు: పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పోషణ 2.0 పథకంలో నాటి ప్రభుత్వం 85.70 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. ఫలితంగా పోషకాహారం సకాలంలో అందించడంలో ఇబ్బందులు పడ్డారు.
నేడు: ప్రస్తుత ప్రభుత్వంలో పోషణ పథకం గాడిన పడింది. కేంద్ర నిధులూ తీసుకుని రాష్ట్ర వాటా నిధులూ కలిపి మొత్తం 1,260 కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసి 21.39 లక్షలమందికి ప్రయోజనం కల్పించింది.
జాతీయ ఆరోగ్య మిషన్:
నాడు: జాతీయ ఆరోగ్య మిషన్‌లో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించి పాత ప్రభుత్వంలో 164.71 కోట్ల రూపాయల బిల్లులు మూలన పడ్డాయి.
నేడు: కూటమి ప్రభుత్వం ఏడాదిలో 1,691.21 కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి వెచ్చించింది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు అవసరమైన యంత్రపరికరాల సరఫరాతో పాటు 60,000 మంది ఆరోగ్య కార్యకర్తలు గౌరవ వేతనం చెల్లింపులు జరిగాయి.
జలజీవన్ మిషన్:
నాడు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా కేంద్రం జలజీవన్ మిషన్ కింద నిధులు కేటాయించగా, గత ప్రభుత్వం 2,255 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించుకుంది. 571.96 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. ఆ పథకం గడువు పూర్తయ్యేలోగా 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరలేదు. పథకం గడువు సైతం ముగిసిపోయింది.
నేడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. ఈ పథకం గడువు పెంచాలని కోరడమే కాకుండా, పథకాన్ని పునరుద్ధరించేందుకు 894.37 కోట్ల రూపాయలు చెల్లించి కేంద్రం నుంచి అదనపు నిధులు సాధించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని 2027-28 వరకు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దాదాపు 80,000 కోట్ల రూపాయలతో తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. దీంతో అనేకచోట్ల పనులు ఊపందుకున్నాయి.
మరికొన్ని ప్రయోజనాలూ ఇలా:
- పీఎం ఆవాస్ యోజన కింద 1,76,000 కుటుంబాలకు ఉపయోగపడేలా 361.91 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.
- సమగ్ర వాటర్ షెడ్ కార్యక్రమం కింద 20,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా 85.56 కోట్ల రూపాయలు బిల్లుల చెల్లింపులు పూర్తి చేశారు.
- గిరిజన ఉప ప్రణాళిక కింద వివిధ ఉపాధి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. గతంలో ఉన్న 14.59 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది. ఫలితంగా వివిధ యూనిట్ల స్థాపనలో ఆలస్యం కాకుండా చూడటంతో 1.50 లక్షలమంది లబ్ధిదారులకు ఊరట దక్కింది.
- మారుమూల గిరిజన వర్గాలకు వివిధ కార్యక్రమాల కింద పెండింగ్‌లో ఉంచిన 32.57 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశారు. దీనివల్ల 4.88 లక్షలమంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగింది. భూమి పంపిణీ చేసి అభివృద్ధి చేయడం, వ్యవసాయ పరంగా అభివృద్ధి పనుల వంటివి ఈ నిధులతో జరిగాయి. గిరిజన ప్రాంతాల్లో వివిధ వసతుల కల్పనకు అవసరమైన 23.21 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు.
- దీన్‌దయాళ్ గ్రామీణ కౌసల్య యోజన కింద 65,000 మంది గ్రామీణ యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా అవసరమైన శిక్షణకు కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించింది.
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు - చిన్న మొత్తాలతోనే అధిక రాబడి!
ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ- ఈ 10 పోస్టాఫీస్ స్కీమ్స్‌తో బోలెడన్ని బెనిఫిట్స్!