ETV Bharat / state

అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు - 2 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

2018 నుంచి అమరావతిలో పెండింగ్‌లో ఉన్న 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం - రెండు ప్రాజెక్టులను సీపీడబ్ల్యూడీ నిర్మిస్తుందని తెలిపిన కేంద్ర ఆర్థికశాఖ

Capital Amaravati Works Updates
Capital Amaravati Works Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 17, 2025 at 7:57 PM IST

|

Updated : June 18, 2025 at 6:54 AM IST

2 Min Read
Choose ETV Bharat

Capital Amaravati Works Updates : రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగుల గృహసముదాయ నిర్మాణాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వీటి కోసం ఏపీ సర్కార్ 22 ఎకరాలు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం రూ.2787 కోట్లతో నిర్మాణాలు చేపట్టనుంది.

అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు (ETV)

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. అమరావతిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి రూ.1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి రూ.1329 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

రెండు ప్రాజెక్టులనూ కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టనుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 22 ఎకరాల 53 సెంట్లు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఏజీసీ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మూడు ముక్కలాటకు దిగడంతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఆ రెండు ప్రాజెక్టుల్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు.

Common Central Secretariat in Amaravati : గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడిడిగా స్థలాలు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా మళ్లీ భూములు కేటాయించింది. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలసి ఉమ్మడి కేంద్ర సెక్రటేరియేట్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు.

గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీటి గురించి ఫాలోఅప్‌ చేస్తూ వచ్చారు. అన్ని ప్రక్రియలూ పూర్తై రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పెమ్మసానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లకు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.

ఓవైపు అండర్​గ్రౌండ్ విద్యుత్ లైన్లు - మరోవైపు జెట్ స్పీడ్​లో అమరావతి పనులు

అమరావతిలో టెర్మినల్స్‌, బస్టాండ్లపై ఆర్టీసీ ఫోకస్ - ప్రతిపాదనలు సిద్ధం

Last Updated : June 18, 2025 at 6:54 AM IST