Moss Cultivation in AP: ఔషధ గుణాలతో పాటు అనేక ప్రయోజనాలున్న సముద్ర నాచు పెంపకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సాగుకు అనువైన ప్రాంతాల అన్వేషణ, అధ్యయనం చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనుకూలతలు ఉన్నట్లు ఇటీవలే తేల్చింది. తాజాగా గుడ్లూరు మండలం కర్లపాళేన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, శిక్షణ మొదలు పెట్టారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మన తీరం మరో చక్కటి ఉపాధికి వేదిక కానుంది. 92 గ్రామాల్లోని సుమారు 2 లక్షల మందికి ఇది ఉపయోగపడనుంది.
అనుకూలత ఇలా: సముద్రపు అలల ఉద్ధృతి తక్కువగా ఉన్న ప్రాంతం నాచు పెంపకానికి పనికొస్తుందని మత్స్యశాఖ గుర్తించింది. సీఎన్‌ఐఆర్ శాస్త్రవేత్తలు కూడా దాన్నే నిర్ధారించారు. ఆ క్రమంలో రామాయపట్నం పోర్టు సమీపంలోని కర్లపాళెం వద్ద ఉన్న సముద్రపు అంచు, బ్రేక్ వాటర్ ఉన్న తీరు అనుకూలమని తేల్చారు. ముత్తుకూరు ప్రాంతంలో కూడా కొన్ని అనుకూల ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ పెద్దఎత్తున నాచు పెంచేందుకు అవకాశం ఉందని భావించారు. మొదట 25 నుంచి 45 మంది మహిళలను ఎంపిక చేసి వారికి శిక్షణ ప్రారంభించారు. 45 నుంచి 60 రోజుల్లో దిగుబడి వస్తుందని సమాచారం. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి విస్తృతం చేయనున్నారు.
నాడు విఫలం అలా: బోగోలు మండలం జువ్వలదిన్నె మత్స్యరేవు సమీపంలో గత ఏడాది ఈ నాచు పెంపకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది కాస్త విఫలం అయ్యింది. అలల తాకిడి, అలాగే నీటిలో ఉప్పుశాతం అధికంగా ఉండటం వల్ల సాధ్యం కాలేదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఫిషింగ్ హార్బర్ బ్రేక్ వాటర్ నేరుగా ఉండటం వల్ల ఇరువైపులా అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండి లక్ష్యం దెబ్బతింది. దాంతో లక్షిత వర్గాలకు నిరాశే ఎదురైంది. తాజా ప్రాజెక్టు మంచి ఫలితాలు కనుక ఇస్తే ఔషధ రంగానికి ఉపయోగపడటంతో పాటు పల్లెకార్లకు అదనపు ఆదాయం సమకూరినట్లే అని అంటున్నారు.