Celebrities visiting Lad Bazar : హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాలతో పాటు విభిన్న రుచులకు ఖ్యాతి గాంచింది. పాతబస్తీలో చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు నగరానికి ఎవరొచ్చినా ఓల్డ్‌సిటీలోని దర్శనీయ ప్రదేశాలను చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు.
తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్‌వరల్డ్ పోటీల సందర్భంగా హెరిటేజ్ వాక్‌ను నిర్వహించగా పోటీదారులు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ అందాలను చూసి ముగ్దులయ్యారు. ఇతర ప్రముఖులు ఇక్కడి అందాలకు ఫిదా అయ్యారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు సినిమా చిత్రీకరణ కోసం వచ్చినప్పుడల్లా విరామ సమయంలో చార్మినార్ వీధుల్లో తారసపడుతుంటారు.

2018లో రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘సింబా’ చిత్రీకరణకు వచ్చిన బాలీవుడ్ నటి సారా అలీఖాన్ చార్మినార్‌ను సందర్శించారు. లాడ్‌బజార్‌లో షాపింగ్ చేశారు. భూత్ పార్ట్-1: సినిమా ప్రమోషన్ సందర్భంగా విక్కీ కౌశల్ చార్మినార్‌లో జనంతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. నటి విద్యాబాలన్, అలీఫజల్‌తో కలిసి 2014లో చార్మినార్ వద్ద బాబీ జాసూస్ సినిమాను ప్రచారం చేశారు. ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ టైమ్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ లాడ్‌బజార్‌లో షాపింగ్ చేశారు.