18 ఏళ్లుగా మిస్టరీగానే - విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు
ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు - న్యాయస్థానానికి హాజరై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 13, 2025 at 10:16 AM IST
CBI Court Issues Notices to Ayesha Meera parents: 18 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతిగృహంలో జరిగిన బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పునర్విచారించిన సీబీఐ సత్యంబాబుపై పెట్టిన ఐపీసీ 376, 302 సెక్షన్లపై ఈ నెల 19న విజయవాడలోని సీబీఐ న్యాయస్థానానికి హాజరై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు నోటీసులు పంపింది. ఈ కేసులో సీబీఐ నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2007 డిసెంబరు 27న హత్యకు గురి: 2007 డిసెంబరు 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతిగృహంలో విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. ఈ కేసులో సత్యంబాబును 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవితఖైదు విధించగా, 2017 మార్చి 31న హైకోర్టు ఈ కేసును కొట్టివేసి సత్యంబాబుని నిర్దోషి అంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.
2018లో పునఃదర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సీబీఐ 3 నెలల క్రితం నివేదికను హైకోర్టుకు అందజేసింది. అయితే ఆ నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని దిగువ కోర్టులో తేల్చుకోవాలన్న హైకోర్టు సూచన మేరకు విజయవాడలోని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసినా వారికి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం: సీబీఐ విచారణ కావాలని తామే హైకోర్టులో పిటిషన్ వేశామని ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా గుర్తుచేశారు. సీబీఐ నివేదికలో ఏముందో తెలియకుండా తాము ఎలా స్పందిస్తామని వారు ప్రశ్నించారు. తమ మత విశ్వాసాలకు భిన్నంగా ఖననం చేసిన ఆయేషా మీరా శరీర భాగాలను అప్పగించామని, నెల రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పి, 6 ఏళ్లు అయినా తమకు అప్పగించలేదని అన్నారు. ఈ కేసు పురోగతి వివరాలు చెప్పాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని కాని ఎలాంటి ఉపయోగం లేదని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరుకాలేమంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
2017లో సంచలనమైన సుగాలి ప్రీతి కేసు - సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
వివేకా కేసులో తేలని కుట్రదారుల కథ - దర్యాప్తును కీలక దశలో వదిలేసిన సీబీఐ

