Cashless Treatment of Road Accident Victims Scheme 2025 : అయ్యయ్యో రక్తం బాగా పోతుందే! ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? ఎవరైనా అంబులెన్స్‌కి కాల్ చేశారా? అనే మాటలు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో తరచుగా వినబడు తాయి. కానీ, క్షతగాత్రులను ఆసుపత్రి తీసుకెళ్లడానికి అనేక మంది సంకోచిస్తారు. పైగా అయ్యో పాపం అని కాసింత జాలి చూపించి చేతులు దులిపేసుకుంటారు. సాయం చేయాలని కొందరికి ఉన్నా తాము ఎక్కడ ఇరుక్కుపోతామో, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అని భయపడి వెనకడుగు వేస్తారు.
ఒకవేళ ఎవరో ఒకరు మంచి మనసులో ఆసుపత్రికి తీసుకెళ్లినా కుటుంబ సభ్యులు వచ్చే వరకు డాక్టర్లు వైద్యం ప్రారంభించని పరిస్థితి. బాధిత కుటుంబాల దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అన్న సందేహం వైద్యుల్లో ఉంటుంది. దీంతో చాలా మంది వైద్యం ఆలస్యమై క్షతగాత్రులు మరణించిన ఘటనలు కూడా అనేకం. ఐతే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం ఓ ముందడుగేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ పథకం రూపకల్పన ఎలా జరిగింది? దీని ద్వారా క్షతగాత్రులకు కలిగే మేలేంటి? లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లక్షన్నర ఉచిత వైద్యం : రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుుడు పేద, మధ్య తరగతి వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బం దులు వర్ణనాతీతం. ముఖ్యంగా ప్రమాద ఘటన జరిగినప్పుడు వైద్య ఖర్చులకు చేతిలో అనా పైస లేక వారు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. కొన్ని సందర్భాల్లో నైతే అడ్వాన్స్ పేమెంట్ చేసేంత వరకు డాక్టర్లు వైద్యం అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరవుతారు. అలాంటి వారికి బాసటగా నిలిచేందుకు కేంద్ర సర్కారు ఓ ముందడుగు వేసింది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చేరిన వెంటనే డబ్బులతో సంబంధం లేకుండా వైద్యం అందిచేలా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లక్షన్నర ఉచిత వైద్యం అందించనుంది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మే 5 తేదీన కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 5 వ తారీఖు నుంచే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గతంతో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025ను ప్రవేశపెట్టింది. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజులదాకా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం సేవలు పొందవచ్చు.
రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులను క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం కిందికి తీసుకురావడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తీస కొచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని తెలిపింది. ఒకవేళ సదరు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపాలని పేర్కొంది. అందుకు ఆయా ఆసుపత్రులకు చెందినవారే రవాణా సౌకర్యాలు కల్పించాలని వివరించింది. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర రహదారుల రవాణాశాఖ పేర్కొంది.
మృతులు ఎక్కువగా 28 ఏళ్ల లోపు వారే : ప్రపంచంలోని మొత్తం వాహనాల్లో భారత్‌లో ఉన్నవి కేవలం ఒక్క శాతం మాత్రమే. కానీ, రోడ్డు ప్రమాదాలు మాత్రం 11 % జరుగుతున్నాయి. ఏటా సుమారు 5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే లక్షా 50 వేల మంది మరణిస్తున్నట్లు అంచనా. అందులోనూ చనిపోతున్న వారిలో అత్యధికులు 28 ఏళ్ల లోపు వారే ఉండటం మరింత కలవరపెడుతోంది. తెలంగాణలో రోజుకు సగటున 20కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడేళ్లలో రాష్ట్రంలో 26 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరగ్గా 11వేల మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో 2023లో 18వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 8వేలకు పైగా దుర్మరణం చెందారు. గతేడాది 17వేల రహదారి ప్రమాదాల్లో, 7వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తం గా ఒక్క 2024లోనే లక్షా 80వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.

"రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 5న ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన లేదు. ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది."- డా.హరినాథ్, అసిస్టెంట్ ప్రొపెసర్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్
గుడ్ సమరిటన్ పథకం : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు గుమి గూడి చూస్తుండగా మరికొందరు మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మార్గం మధ్యలో చనిపోయి పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతుంటారు. అలాంటి వారికి రక్షణ కల్పించడంతోపాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే గుడ్ సమరిటన్ కింద 5 వేల రూపాయల నగదుతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి ఏటా లక్ష రూపాయల అదనపు ప్రోత్సాహం అందిస్తారు. గుడ్ సమరిటన్ పథకం 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఐతే, ఇది ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా తగిన ప్రచారం లేకపోవడంతో ప్రజల్లో అవగాహన కొరవడినట్లు నిపుణులు చెబుతున్నారు.

గుడ్ సమరిటన్ పథకానికి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు అధికారిక లెటర్ ప్యాడ్‌పై ప్రాణదాత అంటూ కాపాడిన వారి పేరు, ఇతర వివరాలు, ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఎక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. ఆసుపత్రి వర్గాలు కూడా సంబంధిత ప్రాణ దాత వివరాలను ధ్రువీకరించి ఠాణాకు సమాచారం ఇస్తారు. పోలీసులు వాటిని పరిశీలించి, జిల్లా స్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో 5 వేల నగదు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్ఠంగా 5సార్లు ఈ అవార్డు పొందవచ్చు. అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసే వారిని వేధింపులు, నిర్బంధం వంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది. క్షతగాత్రుల్ని చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు.
హెల్మెట్ ధరించకపోవడంతో 70శాతం ప్రమాదాలు : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగినంత కృషి చేస్తున్నా ప్రజల నిర్లక్ష్య ధోరణితో అవి పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో కేవలం నిర్లక్ష్యం, ఏమరుపాటు కారణంగా జరుగుతున్నవే ఎక్కువ. రహదారులపై అప్రమత్తంగా ఉండకపో తే ప్రమాదం తప్పదని తెలిసినా అనేక మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను వేగంగా నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో 70శాతం ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. 10 శాతం ప్రమాదాలు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, గుంతల వల్ల సంభవిస్తున్నాయి.

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనులపై కఠిన చర్యలు : ప్రమాదానికి కారణం ఏదైనా బాధితులకు ఏం కావొద్దని కోరుకుంటాం. కానీ, అందుకు తగిన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడం శోచనీయం. క్షతగాత్రులను కాపాడేందుకు కొలువుతీర్చిన ట్రామాకేర్ సెంటర్లు చాలాచోట్ల వసతులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. ఈ దుస్థితిని తప్పించడంతో పాటు అవసరం మేరకు అన్నిచోట్లా వాటిని ఏర్పాటుచేయాలి. దేశీయంగా హైవేల పైనే ఎక్కువగా మరణ మృదంగం మోగుతోంది. వాటిపై సంచార వైద్యశాలలను ఏర్పాటు చేస్తే కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారిని రక్షించవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రులూ ఉదారంగా వ్యవహరించాలి. మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడపడం ప్రాణాంతకం. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్లపై యాక్సిడెంట్లకు అత్యధిక ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ దశనుంచే రహదారి భద్రతకు పాలకులు అధిక ప్రాధాన్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.