అమ్మ ఒడికి దూరమవుతున్న పసికూనలు - దళారుల చేతిలో అంగడి సరకుగా చిన్నారులు
శిశువిహార్ ఒడికి చేరుతున్న బాలలు - కన్నవారిని గుర్తించి అప్పగించటమే సవాలు - అటు కన్నపేగు ఇటు చేరదీసిన బంధాలు దూరమై అనాథలుగా మారుతున్న తీరు

Published : August 3, 2025 at 1:50 PM IST
Child Trafficking In Hyderabad : జీవితంలో తెలియక వేసిన తప్పటడుగులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కారణాలేవైనా పసికూనలు అమ్మఒడికి దూరమవుతున్నారు. దళారుల చేతిలో అంగడి సరకుగా మారిపోతున్నారు. ఆడ, మగ కొనేవారి స్థోమత అవకాశానికి తగినట్టుగా మార్కెట్లో అమ్మేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన సందర్భాల్లో ఆ చిన్నారులను శిశువిహార్‌కు తరలిస్తున్నారు. అప్పటి వరకు జన్మను ఇవ్వకపోయినా పెంచిన తల్లులు బిడ్డపై మమకారం చంపుకోలేక విలవిల్లాడుతున్నారు. అటు కన్న వారు, ఇటు పెంచుకుందామని దగ్గరకు తీసుకున్న బంధాలు దూరమై అనాథలుగా మారుతున్నారు.
అంతర్రాష్ట్ర శిశువిక్రయాల ముఠా : సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ ముసుగులో సాగించిన అక్రమ దందాలు ఒక్కొక్కటిగా మెల్లగా వెలుగుచూస్తున్నాయి. అద్దె గర్భంతో రక్తం పంచుకున్న బిడ్డలను ఇస్తానంటూ ఆసుపత్రికి వచ్చే ప్రతి 100 మందిలో 80 మందికి దళారుల నుంచి కొనుగోలు చేసిన పిల్లల్నే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పోలీసులు అంతర్రాష్ట్ర శిశువిక్రయాల ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు.
దత్తత ప్రక్రియ ఆలస్యమవుతుందనే : సుమారు 10 మందికి పైగా చిన్నారుల్ని స్వాధీనం చేసుకొని శిశువిహార్‌కు పంపారు. వారిని తాము దత్తత తీసుకున్నామంటూ ఎంతో మంది తల్లులు రోజులు తరబడి నగరంలో పడిగాపులు కాశారు. చట్టప్రకారం దత్తత ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఆలోచనతో సంతానలేమితో ఇబ్బందిపడుతున్న కొందరు దంపతులు ప్రైవేటు ఆసుపత్రులను, దళారులను నమ్మి ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం శిశువిహార్‌లో ఏకంగా 140 మందికి పైగా చిన్నారులున్నారు.
పిలుపు కోసం అడ్డదారులు
- నగరంలో ఏటా 20 నుంచి 30కు పైగా పిల్లల విక్రయాలు, అపహరణ కేసులు నమోదవుతున్నాయి.
- నలుగురు ఆడపిల్లలు కావటంతో మగ సంతానం కోసం ఓ తండ్రి ఫుట్‌పాత్‌పై తల్లి ఒడి నుంచి బిడ్డను ఎత్తుకెళ్లి వదిలేశాడు.
- అఫ్జల్‌గంజ్ సమీపంలో మరో వ్యక్తి పిల్లాడికి తినుబండారాలు ఆశచూపి ఎత్తుకెళ్లాడు. పిల్లల్లేని వారికి అమ్మి సొమ్ము చేసుకోవాలని ముందస్తుగా పథకం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
- పిల్లలు పుట్టకపోతే భర్తకు వేరే పెళ్లిచేస్తానంటూ అత్తింటివారు బెదిరించటంతో గర్భవతినంటూ ఓ మహిళ వారికి అబద్దం చెప్పింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్తున్నట్టు కర్ణాటక నుంచి నగరానికి చేరింది. దాన్ని నిజం చేయడానికి ఏకంగా ఓ పిల్లాడ్ని కిడ్నాప్ చేసింది.
శిశువిక్రయ కేసుల్లో : ఆసుపత్రులు, దళారుల డబ్బు ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఆ సమయంలో పట్టుబడిన పిల్లల్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని శిశువిహార్‌లో ఉంచుతారు. ఆ పిల్లల అసలు తల్లిదండ్రులను గుర్తించి అప్పగించటం ఇప్పుడు మరీ క్లిష్టంగా మారుతోంది. పిల్లల్ని తీసుకొచ్చిన దళారులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్తుండటంతో ఈ సమస్య ఏర్పడుతుంది. మరికొందరైతే ఏకంగా పేరు, చిరునామా మార్చుకొని వేరే చోటికి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పిల్లల్ని ఎవరి వద్ద కొనుగోలు చేశారో, కుటుంబ సభ్యులెవరనేది అంచనా వేయటం కష్టమంటూ ఒక పోలీసు అధికారి తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షలో నిర్దారణ అయితేనే ఆ బిడ్డల్ని వారి తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పగిస్తున్నారు. అప్పటి వరకూ శిశువిహార్ కేంద్రంలోనే సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు.
సరోగసీ చట్టాలు ఏం చెబుతున్నాయి? - సృష్టి వ్యవహారం మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతోంది?
రూ.10 వేలకు మైనర్ బాలిక అమ్మకం - 'అన్న' రీల్‌కు లైక్ కొట్టడంతో వెలుగులోకి

