Case Registered Against Former Minister Peddi Reddy : అటవీ భూములు ఆక్రమించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించడంపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరపై కేసులు నమోదయ్యాయి. అటవీ భూములను ఆక్రమించడంతో పాటు జీవ వైవిద్యానికి హాని కలిగించారని కేసు పెట్టారు.
అటవీ భూములను ఆక్రమించిన వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టు ఉచ్చు బిగుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈనెల ఆరో తేదీన కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీప్రాంతంలో భూమిని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించినట్లు నిర్ధారించిన అటవీశాఖ అధికారులు ఏపీ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటక్షన్‌యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు పెట్టారు.
అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన తీరుపై ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్‌లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. స్పందించిన ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కమిటీ ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు కమిటీ నిర్ధారించింది. అనుమతులు లేకుండా బోరు వేశారని, అటవీ భూమి ఆక్రమణలతో జీవ వైవిధ్యానికి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు.
పెద్దిరెడ్డి అకక్రమాలపై చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం మరోవైపు ఆక్రమణకు గురైన భూమిని సంరక్షించే కార్యక్రమాలు చేపట్టింది. అటవీ ప్రాంతం వరకు హద్దు రాళ్లు నాటుతున్నారు. త్వరలో పాకాల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినందున దీనిపై పోలీసు అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. పెద్దిరెడ్డి అక్రమాలకు సకహరించిన రెవెన్యూ, అటవీశాఖ అధికారుల వివరాలు సేకరిస్తున్నారు. వారిపైనా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తిరుపతిలో బుగ్గమఠం భూములు స్వాహా - తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న దందాలు
పెద్దిరెడ్డి ఇంటిదగ్గరే సర్వే చేస్తారా? ఆగని అనుచరుల ఆగడాలు - అధికారులు, మీడియాపై బెదిరింపులు