Cancer Student Get Good Marks: చిన్న వయసులోనే ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ మహమ్మారి పుండ్లు వేధిస్తున్నా ఆమె వెరవలేదు. చికిత్సకు వెళ్లినప్పుడు కూడా పుస్తకాలను వీడలేదు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివింది. తాజాగా ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 440 మార్కులకు 420 సాధించి సత్తా చాటింది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఇ. సృజనామృతకు 2023 సెప్టెంబరులో 10వ తరగతి చదివే రోజుల్లో ఒకసారి బాగా గొంతునొప్పి వచ్చి నోటిమాట రాలేదు. ఆ మరుసటి రోజే జ్వరం సైతం రావడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా గొంతు, గుండె, పొట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే కీమోథెరపీ చికిత్స చేయకపోతే అమ్మాయికి ప్రాణహాని ఉంటుందని వైద్యులు చెప్పారు.
గత ఏడాది 10వ తరగతి పరీక్షల సమయంలోనే వారానికి 5 రోజుల చొప్పున నాలుగు వారాల పాటు రేడియేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఉదయం పరీక్ష రాసి మధ్యాహ్నం హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకునేది. ఒకానొక సమయంలో ఆ థెరపీ తీవ్రతను భరించలేక బాధతో విలవిల్లాడేది. అయినా కూడా ఆసుపత్రికి వెళ్లేటప్పుడు పుస్తకాలను తన వెంటే తీసుకుని వెళ్లి చదువుకునేది. ఇలా 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గానూ 493 సాధించింది. కీమోలు, రేడియేషన్లతో పాటు నిత్యం పదుల సంఖ్యలో మాత్రలు, అప్పుడప్పుడూ ఇంజెక్షన్లు చేయించుకుంటూనే ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరం పరీక్షలు రాసింది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సృజనామృతకు 420 మార్కులు రావడంతో పాటు బోటనీ, జువాలజీల్లో 60కి 60 మార్కులు వచ్చాయి.
తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం: నాన్న ఉరుకుంద కర్నూలు ఏపీఎస్పీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారని, ఆయన తనకు ఎంతో ధైర్యాన్నిచ్చారని సృజనామృత చెప్పింది. అమ్మ జానకి ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఆరోగ్యం పాడవ్వకుండా జాగ్రత్తగా చూసేదని తెలిపింది. దీంతో తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరిగిందని, 420 మార్కులు రావడం ఆనందంగా ఉందని సృజనామృత పేర్కొంది.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో విచిత్రం - అన్ని సబ్జెక్టుల్లో 99% - ఇంగ్లీష్‌లో 5 మార్కులే
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల - రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం