BSF Jawan Request To AP Government: దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు భారత సైనికులు సరిహద్దుల్లో గస్తీ కాస్తారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు ధైర్యసాహసాలను ప్రదర్శించడం అభినందించదగ్గ విషయం. కానీ దేశం కోసం పోరాడే ఓ బీఎస్ఎఫ్ జవాను కుటుంబానికే అనుకోని సమస్య వస్తే, దాని కోసం దేశ సరిహద్దుల్లో ఉన్న జవాను స్పందన ఏమిటి? ఈ సమస్యను అతను రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు.
బీఎస్ఎఫ్ జవాన్ కుటుంబ సభ్యులకు చెందిన భూములను కబ్జా చేశారని బీఎస్ఎఫ్ జవాన్ నర్సింహమూర్తి మాట్లాడిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జమ్ము కశ్మీర్ సరిహద్దులో విధులను నిర్వహిస్తూ దేశానికి రక్షణగా నిలిచాను, అటువంటిది ఇప్పుడు మా గ్రామంలోని నా కుటుంబానికే రక్షణ లేకుండా పోయిందని బీఎస్ఎఫ్ జవాన్ మాట్లాడిన భావోద్వేగంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జవాన్ మనోగతం: శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఉదుగురు గ్రామానికి చెందిన నర్సింహమూర్తి అనే నేను జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో భారత రక్షణ శాఖలో విధులను నిర్వహిస్తున్నానని ముందుగా అతన్ని పరిచయం చేసుకున్నారు. అయితే మూడు సంవత్సరాల క్రితం కే.శివరం గ్రామంలో నా భార్య తల్లిదండ్రులు (అత్త, మామలకు) చెందిన రెండు ఎకరాల భూమిని అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేశాడని జవాన్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.
దేశ రక్షణ చేస్తున్న తమకు సొంత గ్రామాల్లో కుటుంబ సభ్యులకు రక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాలు చుట్టూ తిరిగి కోర్టులో భూమిపై సర్వహక్కులు మా కుటుంబ సభ్యులు పొందామని వెల్లడించారు. అయితే ఆ భూమిలో తన అత్తమామలు, తల్లిదండ్రులు వెళ్లినప్పుడు రాళ్లతో కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని నరసింహమూర్తి ఆరోపించారు. ఇప్పటికైనా ఈ వీడియోను మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం జరిగేలా అన్ని విధాలా చర్యలు చేపట్టాలని జవాన్ నరసింహమూర్తి సరిహద్దులో నుంచి సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్దించారు.
బీఎస్ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్
పాక్ కాల్పుల్లో గాయాలు - చికిత్స పొందతూ అమరుడైన BSF కానిస్టేబుల్