Boys in Top Ten Positions in EAPCET Results AP: ఈఏపీ సెట్ ఫలితాల్లో తొలి పది స్థానాల్లో అబ్బాయిలే సత్తా చాటారు. అయితే మొత్తంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది అర్హత సాధించారు. ఆదివారం సాయంత్రం ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తొలి పది స్థానాల్లో అబ్బాయిలదే హవా: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో 75.67 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్, వ్యవసాయ - ఫార్మసీ రెండు విభాగాల్లో తొలి పది స్థానాల్లో అబ్బాయిలే నిలిచారు. అయితే మొత్తంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది అర్హత సాధించారు. 160 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 25 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.
ఈ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి అర్హత మార్కులు లేవు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో అబ్బాయిల 70.33 శాతం మంది అర్హత సాధించగా అమ్మాయిలు 73.37 శాతం మంది అర్హులయ్యారు. వ్యవసాయ, ఫార్మసీలో అమ్మాయిలు 89.76 శాతం మంది అర్హులవగా అబ్బాయిలు మాత్రం 89.92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్, వ్యవసాయ ఫార్మసీలో తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులకు 1, 8, 2, 4 ర్యాంకులు లభించాయి. రాత పరీక్షతో పాటు ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు.
గతేడాది కంటే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం: ప్రాథమిక ‘కీ’ పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ సమాధానాలు మార్పు చేసింది. జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కో ప్రశ్నకు సమాధానాలు మారాయి. మొత్తం 14 ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఇంజినీరింగ్‌లో దాదాపు లక్షా 95,092 మంది అర్హత సాధించగా ఈ సారి మాత్రం లక్షా 89,748 మంది అర్హత పొందారు. బైపీసీ స్ట్రీమ్‌లో గతేడాది 70,352 మంది అర్హత సాధించగా ఈ ఏడాది 67,761 మంది ఉత్తీర్ణతను సాధించారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ కౌన్సెలింగ్ తర్వాతే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతుల ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. గతేడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
రీజియన్లుగా సీట్ల భర్తీ: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీ కోసం ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్‌లుగా చేస్తారు. అయా రీజియన్‌లో 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం జనరల్ కోటా సీట్లు సైతం ఏపీకి చెందిన వారికే ఇస్తారు. ఆంధ్ర రీజియన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర రీజియన్ పరిధిలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం తదతర జిల్లాలు ఉన్నాయి.
ఉచితంగా జేఈఈ, నీట్, ఈఏపీసెట్ మెటీరియల్ - విద్యార్థుల హర్షం
LIVE ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - AP EAPCET 2024 Result