Book MY Service APP in Vijayawada : కాలు కదపకుండానే చకచకా అవసరమైన సేవలు పొందే సౌకర్యాలు ఇప్పుడు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల అవసరాలు, వారి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఔత్సాహికులు ఆన్‌లైన్ వేదికగా అంకుర సంస్థలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆహారం నుంచి ఆహ్లాదం వరకు, నిత్యావసరాల నుంచి ఇంట్లోని వస్తువుల రిపేర్లు, శుభకార్యక్రమాలకు అర్చకుల నుంచి పూజా సామగ్రి ఇలా ఎన్నో సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే విజయవాడలో బుక్ మై సర్వీస్ పేరిట సేవలందిస్తోన్న స్టార్టప్ ఇప్పుడు ఎక్కువ మంది ఆదరణ పొందుతోంది.
రియల్ మిల్క్ పేరిట రైతుల నుంచి నేరుగా పాలు సేకరించి ఆన్‌లైన్ వేదికగా వినియోగదారుల చెంతకు చేర్చిన ఎన్‌ఆర్‌ఐ బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బుక్ మై సర్వీస్ పేరిట మరో స్టార్టప్‌ను తీసుకొచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీ కేంద్రంగా నగర వాసులతోపాటు చుట్టుపక్క ప్రాంతాలకు కూడా సేవలందిస్తున్నారు. తక్కువ సమయంలోనే కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ వారి ఆదరణను చూరగొంటున్నారు.
Book MY Home Services in Vijayawada : ఈ యాప్‌లో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, మెకానిక్, పెస్ట్ కంట్రోల్, పనిమనిషి, వంటమనిషి, బ్యూటీషియన్, ఇంటి శుభ్రత, వృద్ధుల సంరక్షణ, ఫిజియోథెరఫి లాంటి తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇళ్లల్లో పూజ కార్యక్రమాల నిర్వహణ కోసం పూజారుల సేవలను ఇందులో ప్రవేశపెట్టారు. వినియోగదారులకు ఈ సేవలను అందించేందుకు విజయవాడతో పాటు సమీప ప్రాంతాల్లోని వివిధ రంగాల నిపుణులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని బెల్లకొండ శ్రీనివాస్ తెలిపారు. మంచి పనితీరు కనబరిచిన వారిని ఓ గొడుకు కిందకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ యాప్ పరిధిలో సేవలందిస్తున్న వారు కూడా ఇతర యాప్‌ల కంటే భిన్నంగా తమకు గుర్తింపు లభిస్తోందని చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
"ఈ సేవలను ఐదు నెలల క్రితం ప్రారంభించాం. ఇంటికి సంబంధించిన సర్వీసులు అందుబాటులోకి తెచ్చాం. వినియోగదారుడు బుక్ సర్వీసుకు సంబంధించి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మా నిపుణులు అక్కడికి వచ్చి ధరను నిర్ణయించి ఆ ప్రకారమే తీసుకుంటారు. అదేవిధంగా ఆరు నెలల వరకు కస్టమర్ వారంటీ క్లైయిమ్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఉచితం." - బెల్లకొండ శ్రీనివాస్, బుక్ మై సర్వీస్ స్టార్టప్ వ్యవస్థాపకులు
కొంత కాలం క్రితం వరకు ఆన్లైన్లో పరిమిత సేవలే అందుబాటులో ఉండేవి. కరోనా తర్వాత నుంచి ఇలాంటి ప్లాట్‌ఫాంల వైపు ఔత్సాహికుల ఆలోచనలతో అనేక స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా ఆన్‌లైన్ ద్వారా జరగని పని అంటూ లేదనే రీతిలో సేవల విస్తృతి పెరుగుతోంది. మరోవైపు వీటివల్ల సమయం ఆదాతో పాటు వెనువెంటనే పనులు పూర్తవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఇలాంటి అంకుర సంస్థలు నిపుణుల సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంతోపాటు పలువురికి ఉపాధి కల్పించేందుకూ దోహదపడుతున్నాయి.
'మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు - 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే రెడ్ వింగ్ డ్రోన్లు'
ఆవుపేడతో పెయింట్- దిగ్గజ సంస్థల్లో ఉద్యోగం వదిలేసి యువకుడి స్టార్టప్