Book Fair At Telugu University : పుస్తకం హస్త భూషణం అంటారు పెద్దలు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. అటువంటి పుస్తక పఠనాన్ని యువతలో, విద్యార్థుల్లో పెంచాలనే లక్ష్యంతో బుక్ ఫెయిర్‌లు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ సైతం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. బుక్‌ఫెయిర్‌తో నగర ప్రజల దృష్టినే కాకుండా సాహిత్య ప్రేమికులను తనవైపు తిప్పుకుంటోంది.
ఈనెల 17వరకు కొనసాగనున్న పుస్తక ప్రదర్శన : పుస్తకం మనల్ని ఎప్పుడూ తలెత్తుకునేలానే చేస్తుంది. అందులో విషయాన్ని బుర్రకెక్కించుకుంటే ఎక్కడైనా మనదే పైచేయి. అలాంటి పుస్తకాల్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ శాఖ బుక్‌ఫెయిర్ నిర్వహిస్తోంది. ఈ నెల 8న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన 17 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ యూనివర్సిటీ పబ్లికేషన్స్ మాత్రమే ఈ బుక్ ఫెయిర్‌లో అందుబాటులో ఉన్నాయి.
తగ్గింపు ధరల్లో పుస్తకాలు : తెలంగాణ, ఆంధ్ర, ద్రవిడ ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర, భాషా పరిణామ క్రమం, కథలు, సంస్కృతి, వారసత్వం విశేషాలు ఇలా దాదాపుగా వందలాది పుస్తకాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ బుక్ ఫెయిర్‌లో పోటీ పరీక్షలకు సంబంధించిన తెలంగాణ పదకోశం వంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే సాయుధ పోరాటాలు, గిరిజన తెగలు, వారి భాషలు ఏ విధంగా పరిణమించాయనే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పుస్తకాలపై 40, 50, 60 శాతం తగ్గింపు ధరలతో అందిస్తున్నారు.
పుస్తక ప్రియులను ఆకర్షిస్తున్న పుస్తక ప్రదర్శన : ఇక్కడ పుస్తకాలు చాలా బాగున్నాయని పుస్తక ప్రియులు చెబుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనకు అభిమానులు వస్తూ ఉన్నారు. పాత పుస్తకాలపై కూడా తగ్గింపు ధరలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా తక్కువ ధరలకే మంచి పుస్తకాలు కొనవచ్చని నిర్వాహకులు వివరిస్తున్నారు. 17వ తేదీ వరకు సాగనున్న బుక్‌ఫెయిర్‌ను మరింత మంది సందర్శించాలని వారు కోరుతున్నారు. బుక్‌ఫెయిర్‌తో నగర ప్రజల దృష్టినే కాకుండా సాహిత్య ప్రేమికులను ఆకర్షిస్తోంది.
పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ తేదీలు ఖరారు - వారికి మాత్రం ఫ్రీ ఎంట్రీ