BIG TREE FELL ON TRAIN : ఏలూరు జిల్లా కైకలూరులో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన జోరు వర్షం తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో కైకలూరు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బిలాస్పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనతో ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
తిరుపతి నుంచి బిలాస్పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కైకలూరు రైల్వే స్టేషన్‌లో ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై ఆగి ఉన్న సమయంలో విపరీతమైన గాలులు ప్రభావానికి బీ4 ఏసీ బోగీపై భారీ చెట్టు పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రైలుపై పడిన వృక్షాన్ని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. రైలు కదిలే మార్గం లేకపోవడంతో సుమారు 3 గంటల పాటు బిలాస్పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫారంపైనే నిలిచిపోయింది. కైకలూరు స్టేషన్ వెంబడి విజయవాడ - భీమవరం వైపు నుంచి వచ్చే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు ప్రయాణానికి ఇక్కట్లు పడ్డారు.
ఈదురు గాలులు, వడగండ్ల వానలు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం అకాల వర్షాలతో పాటు ఈదురు గాలులు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆరబెట్టిన పొగాకు, మిరప, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి నేలరాలింది. ప్రకాశం జిల్లా కనిగిరి, హనుమంతునిపాడు మండలాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు దాటికి కనిగిరి పట్టణంలోని బాలికోన్నత పాఠశాల వద్ద విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో విద్యుత్ తీగలు రోడ్డుపై చల్లాచెదురుగా పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. కనిగిరిలో వేళ్లతో సహా పలు చెట్లు నేలవాలాయి.
విజయవాడలో భారీ ఈదురు గాలులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వలన విద్యుత్తు సరఫరా నిలిచింది. హోర్డింగులు, స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. కాకినాడ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పల్నాడు జిల్లాలో ఈదురుగాలులకు తోడు చిరుజల్లులు కురిశాయి.
పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మే నుంచే వర్షాలు - నైరుతిలో సాధారణమే!
అకాల వర్షాలతో తీవ్ర నష్టం - ప్రభుత్వం ఆదుకోవాలంటున్న అన్నదాతలు