Bhuvaneshwari Posted Video of CBN in Assembly on Twitter : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రెండున్నర సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి స్పందించారు. నేడు గౌరవసభలో 'ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు' అంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓ వీడియో పోస్ట్ చేశారు. 'నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ ప్రజలకు ప్రణామం అని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో తెలుగువారి ఆత్మగౌరవం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. నాడు సభలో చంద్రబాబు శపథం నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ భువనేశ్వరి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైఎస్సార్సీపీ సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు.
గతంలో చంద్రబాబు చేసిన శపథమిది: ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం అని 2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైఎస్సార్సీపీపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఆయన సభలో అడుగు పెట్టారు.
ఎమ్మెల్యేలుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం