Pravallika in 175 Online Courses : సాధారణంగా పాఠశాల అయిపోగానే విద్యార్థులు గబగబా హోం వర్క్ చేసేసి బ్యాగు ఓ మూలన పడేసి యూనిఫామ్ కూడా తీయకుండా ఆటలకు పరుగుతీస్తారు. పదో తరగతి వరకు చాలా మంది ఇలానే చేశారనుకోండి. కానీ, ఆ విద్యార్థిని అందుకు భిన్నం. స్కూల్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి 175 సర్టిఫికెట్ కోర్సులు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసింది. అందుకే ప్రముఖ టెలివిజన్ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధులు వెతుక్కుంటూ వచ్చి మరీ ఇంటర్వ్యూ చేశారు.
పదో తరగతి 15 ఏళ్ల వయసు. చదవడం, పరీక్షలు రాయడం, పాస్ మార్కులు సంపాదించడం. విద్యార్థుల ఆలోచన విధానం ఇదే. కానీ ఈ విద్యార్థినీ అంతకు మించి ఆలోచన చేసింది. భవిష్యత్ అవసరాల కోసం ఉపాధి నైపుణ్యాలు నేర్చుకునేందుకు బాటలు వేసుకుంది. తరగతి గదులకు హాజరవుతూనే ఖాళీ సమయంలో 175 సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసింది. అదీ ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయడం గమనార్హం.
ఈ విద్యార్థిని పేరు బండారు ప్రవల్లిక. అనకాపల్లి జిల్లా కోనెంపాలెంలో జన్మించింది. కొవిడ్ సమయంలో నాన్న దాలిబాబు చనిపోయారు. అమ్మ ఓ దుస్తుల కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమీలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసిందీ అమ్మాయి. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఆన్‌లైన్ కోర్సుల గురించి స్కూల్‌కి వచ్చిన కొందరు అధికారులు వివరించారు. అప్పుడే సర్టిఫికెట్ కోర్సులు చేయాలని నిర్ణయించుకుందీ ప్రవల్లిక.
Bheemili KGBV Student in 175 Courses : పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఒక్కొక్క కోర్సు నేర్చుకోవడం ప్రారంభించింది. టైమ్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డ్రోన్, రోబోటిక్, ఏఐ ఇలా 175 కోర్సులు పూర్తి చేసింది. ఒక్కో కోర్సు నేర్చుకోవడానికి మూడు గంటల నుంచి ఒకరోజు సమయం పట్టేదని చెబుతోంది. తనతో పాటు మరో 20 మంది విద్యార్థులు సర్టిఫికెట్ కోర్సులు మొదలు పెట్టినా తనొక్కతే ఏడాది వ్యవధిలోనే ఎక్కువ కోర్సులు చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
చిన్న వయసులోనే ఇన్ఫోసిస్ ఆన్‌లైన్‌లో అందించే 175 సర్టిఫికెట్ కోర్సులు విజయ వంతంగా పూర్తి చేసింది ప్రవల్లిక. దీంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధులు ఈ విద్యార్థిని అభినందించారు. అంతేకాదు దిల్లీ నుంచి వచ్చి మరీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవల్లిక అసమాన్య ప్రతిభను గుర్తించి ప్రశంసించారు. సాధారణంగా 50 సర్టిఫికెట్ కోర్సులు చేయడమే గగనం.
"ఇన్ఫోసిస్ ప్లాట్ ఫాంలో చాలా కోర్సులు ఉంటాయి. మనకు నచ్చిన కోర్సును తీసుకోవాలి. ఈ కోర్సు నేర్చుకోవడానికి రెండు, మూడు గంటల సమయం పడుతోంది. కోర్సు పూర్తైన తర్వాత పరీక్ష పెడతారు. అందులో పాస్ అయితే సర్టిఫికెట్ ఇస్తారు. అలా 175 కోర్సులు పూర్తిచేశాను. ఈ విషయం తెలుసుకొని విద్యా శాఖ మంత్రి లోకేశ్ మా పాఠశాలకు వచ్చారు. అంతే కాకుండా ఇతర అధికారులు ఇక్కడికి వచ్చి నన్ను అభినందించారు." - ప్రవల్లిక, విద్యార్థిని
అలాంటిది 175 సర్టిఫికెట్ కోర్సులు చేయడంపై ఇన్ఫోసిస్ సంస్థ ప్రవల్లిక ప్రతిభానైపుణ్యాన్ని అభినందించింది. బీటెక్, ఎంటెక్ చేసిన వారికే కష్టమైన ఈ కోర్సులను కేవలం ఏడాదిలో 175 చేసిందని కొనియాడింది. చదువులోనే కాదు ఆటల్లోనూ ప్రతిభ కనబరుస్తోంది. స్కూల్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో జట్టుకు పతకాలు అందించింది. ఇన్ని కోర్సులు పూర్తి చేయడం పట్ల ప్రవల్లిక తల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె ఉన్నత స్థాయికి చేరుకునేలా చదివిస్తానని చెబుతున్నారు.
ఈమె స్ఫూర్తితో ఇదే పాఠశాలకు చెందిన మరో నలుగురు విద్యార్థులు 100 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేశారు. ప్రవల్లిక చాలా చురుకైనదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 175 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకుని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. ప్రవల్లిక ప్రతిభను గుర్తించిన శ్రీచైతన్య విద్యాసంస్థ పవల్లిక ఉచిత సీటు కల్పించేందుకు ముందుకొచ్చింది. తనూ బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేయాలని భావిస్తోంది. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే లక్ష్యమని చెబుతోంది.
రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating