Bharat Biotech cholera vaccine Hillchol : భారత్ బయోటెక్ సంస్థ నుంచి మరో ఉత్పత్తి మార్కెట్లోకి రానుంది. కలరా నియంత్రణ కోసం సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన హిల్‌కాల్ టీకా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయింది. కలరాను వ్యాప్తి చెందించే ఒగావా, ఇనబా సెరోటైప్ బ్యాక్టీరియాల నియంత్రణలో ఇది సమర్థంగా పనిచేసినట్లు క్లినికల్ పరీక్షల్లో తేలింది. ఈ టీకా ద్వారా పెద్దలు, పిల్లలను ఈ మహమ్మారి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. ‘హిల్‌కాల్’ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా(ఓసీవీ- ఓరల్ కలరా వ్యాక్సిన్) కావడం మరో ప్రత్యేకత.
టీకా మూడో దశ క్లినికల్ పరీక్షల ఫలితాలను సైన్స్ డైరెక్ట్‌కు చెందిన వ్యాక్సిన్ జర్నల్ ప్రచురించింది. దేశంలోని 10 ప్రాంతాల్లో పెద్దలు, పిల్లలు కలిపి 1800 మందిపై ఈ టీకా పరీక్షలు నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరిగింది. వారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కానందున, ఈ టీకా భద్రమైందని తేలింది. క్లినికల్ పరీక్షల సమాచారాన్ని త్వరలో ఔషధ నియంత్రణ సంస్థలకు పంపుతామని, తుది అనుమతులు రాగానే విపణిలోకి విడుదల చేస్తామని సంస్థ తెలిపింది.
కలరా వ్యాధిని టీకా ద్వారా అదుపు చేయొచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి అందుబాటులో లేక సమస్యలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. నోటి ద్వారా తీసుకునే హిల్‌కాల్ టీకాతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని చెప్పారు. వ్యాక్సిన్ ఖర్చు తక్కువే అయినందున అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు జరుగుతుందని డాక్టర్ కృష్ణ ఎల్ల వివరించారు.
కలరా వ్యాధి ఆహారం, నీటి కల్తీ వల్ల విస్తరిస్తుంది. ఏటా 28 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతుంటే, దాదాపు 95,000 మంది మృత్యువాత పడుతున్నారు. నోటి ద్వారా తీసుకునే కలరా టీకా అమ్మకాలు ఏటా 10 కోట్ల డోసుల వరకు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఒకే కంపెనీ ఇటువంటి టీకాను సరఫరా చేస్తున్నందున, టీకా లభ్యత సమస్యగా ఉంది. త్వరలో హిల్‌కాల్ టీకాను భారత్ బయోటెక్ హైదరాబాద్, భువనేశ్వర్‌లోని తన యూనిట్లలో ఏడాదికి 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
క్యాన్సర్, జెనెటిక్ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్! - 'సెల్, జీన్ థెరపీ' విధానంలోకి భారత్ బయోటెక్
కలరా నియంత్రణకు భారత్ బయోటెక్ హిల్‌కాల్ వ్యాక్సిన్ - Bharat Biotech Oral Cholera Vaccine