Solar Plants in Vizianagaram District: పర్యావరణ పరిరక్షణ విద్యుత్తు వాడకాన్ని తగ్గించడం సౌరశక్తి వినియోగం పెంపులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే ప్లాంట్లు పెట్టుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో లక్ష్య సాధనకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నారు. వారికి పూర్తిస్థాయిలో ఉచితంగా పథకాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక కిలోవాట్ సామర్థ్యం గల ప్లాంటు పెట్టుకుంటే 120 యూనిట్ల వరకు ఉత్పత్తినిస్తుంది. దీంతో ఇప్పటివరకు వచ్చే రూ.1000 సాధారణ బిల్లు కాస్త రూ.338కు తగ్గుతుంది. అంటే ఏడాదికి రూ.8,000 వరకు ఆదా అవుతుంది. రెండు కిలోవాట్లకు 240 యూనిట్ల వరకు ఉత్పత్తి కాగా ఏడాదికి రూ.20,000, 3 కిలోవాట్ల ప్లాంటు పెట్టుకుంటే రూ.32,400 వరకు ఆదా చేసుకోవచ్చు. పలకల ఏర్పాటుకు డాబా ఇళ్లపై కనీసం 10 చ.మీ లేదా 100 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. ఎస్టీ, ఎస్సీలకు పక్కా ఇళ్లు లేకపోతే సమీపంలోని ఖాళీస్థలాల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
దూసుకెళ్తున్న సౌర విద్యుత్ రంగం - ఐదేళ్లలో కోటి 60 లక్షల ఉద్యోగాలు
నెలకు రూ.8 వేలు మిగులు: 5 కిలోవాట్ల ప్లాంటు పెట్టుకున్నామని దానికి రూ.78 వేలు రాయితీ దక్కిందని విజయనగరం వాసి పి. రమేష్ తెలిపారు. దీనికోసం అదనంగా రూ.1.10 లక్షలు పెట్టామని 6 నెలల నుంచి వినియోగిస్తున్నామని తెలిపారు. గతంలో వేసవి కాలంలో నెలకు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు బిల్లు వచ్చేదని ప్రస్తుతం సర్వీసు ఛార్జీల కింద రూ.100 మాత్రమే కడుతున్నామని తెలిపారు. అలానే మిగులు విద్యుత్తు కూడా ఉంటోందని చెప్పారు.
లక్ష్య సాధనపై దృష్టి: సూర్యఘర్ పథకం దేశ ప్రగతికి ఎంతో ఉపయోగమని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు అంటున్నారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకుని సౌర విద్యుత్తు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కల్పించి నిబంధనలన్నీ సరళతరం చేశామని వివరించారు. దీనికోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు లక్ష్మణరావు తెలిపారు.
'పీఎం సూర్యఘర్' కింద వారికి ఉచితంగా సోలార్ ప్యానెల్స్
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ - తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు