Bathukamma Sarees Thrown in At Rythu Bazar : తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా గత ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన చీరలు సర్కార్ మారగానే వృథాగా పారేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని పాత రైతు బజారులో చీరలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని అక్కడ ఎవరు, ఎందుకు పారేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరులో సహా పలు ప్రాంతాల్లో అధికారులు అందజేయలేదు. దీంతో నిరుపయోగంగా ఉన్న పాత చీరలను రైతు బజార్‌కు తీసుకొచ్చి వృథాగా పడేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ షెడ్లకు చీరలు కట్టి చిన్నారులకు ఊయలలా వాడుతున్నారు. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు అంటున్నారు. కాగా చీరలను రైతు బజారులో ఎవరు పడేశారో తమకు తెలియని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.